మహబూబ్‌నగర్ క్రీడలు: వరంగల్‌లో ఈనెల 15న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల కార్నివాల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను ఈనెల 11వ తేదీన స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 14 ఏళ్లలోపు బాలబాలికలకు 60 మీ., 600 మీటర్ల పరుగు, 20 ఏళ్లలోపు వారికి 100 మీ., 400మీటర్ల పరుగు, పురుషులు, మహిళలకు 100 మీ., 400మీటర్ల పరుగు పందెం పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్‌ఎస్‌సీ మెమో, జనన ధ్రువీకరణ పత్రం, కులధ్రువపత్రంతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని ఆయన కోరారు.
జిల్లాకు చేరిన టెన్త్ ప్రశ్నపత్రాలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఈనెల 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ప్రశ్నపత్రాలు సోమవారం చేరాయి. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు సంబంధించి 14 వేల ప్రశ్నపత్రాల చొప్పున జిల్లాకు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 13 స్ట్రాంగ్ పాయింట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో డిపాజిట్ చేశారు. సోమవారం హన్వాడలోని స్ట్రాంగ్ పాయింట్‌ను డీఈఓ ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. స్ట్రాంగ్ పాయింట్లలో డిపాజిట్ చేసిన ప్రశ్నపత్రాలు పరీక్ష ప్రారంభానికి ముందు కేంద్రాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు.
17, 18నయూనివర్సిటీల కన్వెన్షన్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఈనెల 17, 18న పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించనున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల కన్వెన్షన్ పోస్టర్‌ను పీయూ వీసీ శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీ కన్వెన్షన్‌కు పీయూ వేదిక కావడం గొప్ప విషయం అన్నారు. విద్యార్థులు, యూనివర్సిటీలకు మేలు జరిగే విధంగా చర్చలు జరుగుతాయని, విద్యార్థుల హక్కులు, అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు సంఘాలు కృషి చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రర్ రమేష్‌బాబు, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు జేపీఎన్‌సీ రవికుమార్, మధుసూదన్‌రెడ్డి, బెక్కం జనార్దన్, అధ్యక్ష, కార్యదర్శులు రాము, రాజేష్, భరత్, శేఖర్, సాయి తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.9,200
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వేరుశనగ క్వింటాకు గరిష్టంగా రూ.9,200, కనిష్టంగా రూ.4,329 ధరలు లభించాయి. అదేవిధంగా కందులకు గరిష్టంగా రూ.7,400, కనిష్టంగా రూ.5,009, పెబ్బర్లు గరిష్టంగా రూ.5,401, కనిష్టంగా రూ.5,370, ఆముదాలు గరిష్టంగా రూ.6,112, కనిష్టంగా రూ.6,040, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,836, కనిష్టంగా రూ.1,600 ధరలు పలికాయి.
● నారాయణపేట మార్కెట్‌యార్డులో పెసర క్వింటా గరిష్టంగా రూ.7,977, కనిష్టంగా రూ.7,427, వేరుశనగ గరిష్టంగా రూ.8,169, కనిష్టంగా రూ.5,940, జొన్నలు గరిష్టంగా రూ.5,369, కనిష్టంగా రూ.5,160, అలసందలు గరిష్టంగా రూ.6,209, కనిష్టంగా రూ.5,600, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,969, కనిష్టంగా రూ.6,501, తెల్లకందులు గరిష్టంగా రూ.7,629, కనిష్టంగా రూ.6,769 ధరలు పలికాయి.
భగీరథ నీటి సరఫరా
నిలిపివేత
నారాయణపేట ఎడ్యుకేషన్: మన్యంకొండ – నారాయణపేట మార్గంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ లీకేజీ మరమ్మతు కోసం 36 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు డి.శ్రీనివాస్ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. లీకేజీ కారణంగా దెబ్బతిన్న పైపు భాగాన్ని తొలగించి.. కొత్త పైపుతో భర్తీ చేసేందుకు గాను నీటి సరఫరా నిలిపివేతతో దేవరకద్ర, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గంలోని మండలాలు ప్రభావితం కానున్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.


