నిర్ణీత కాలంలో పరిష్కరించి.. నివేదిక ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

నిర్ణీత కాలంలో పరిష్కరించి.. నివేదిక ఇవ్వండి

Mar 11 2026 8:54 AM | Updated on Mar 11 2026 8:54 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ప్రజావాణికి ప్రజలు జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి ఎంతో నమ్మకంతో వారి సమస్యల పరిష్కారం కోసం వస్తారని, వారి ఫిర్యాదులు, వినతులను పరిశీలించి తగు న్యాయం చేయాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 119 అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించడం అధికారుల బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు జాగ్రత్తగా చదివి, అందులో పేర్కొన్న సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుని, అవసరమైన విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలన్నారు. అలా కాకుండా ఒక శాఖ నుంచి మరొక శాఖకు అర్థం లేకుండా దరఖాస్తులను పంపించడం సరైన పద్ధతి కాదనిచెప్పారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించి స్పష్టమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్‌, అటవీ శాఖ, డీఆర్‌డీఏ, ప్రణాళిక శాఖ, గనుల శాఖ, భూ సేకరణ విభాగాలకు చెందిన అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై కలెక్టర్‌ వివరణ కోరారు. వచ్చే వారంలోగా అన్ని పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించి, గత వారం అందిన దరఖాస్తుల సంఖ్య, పరిష్కరించినవి, ఇంకా పెండింగ్‌లో ఉన్నవి వంటి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను స్పష్టమైన నమూనాలో సమర్పించాలని ఆదేశించారు.

● 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్‌, గ్రామ పంచాయతీ, మండల, మున్సిపాలిటీ, జిల్లాస్థాయిలో రోజువారీ షెడ్యూల్‌ ప్రకారం ప్రజలు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. ప్రతి రోజూ చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వివరాలను కార్యక్రమం అనంతరం జిల్లా అధికారుల వాట్పప్‌ గ్రూప్‌లో అప్‌లోడ్‌ చేయాలని, ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాస్థాయిలో నోడల్‌ అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ పర్యవేక్షిస్తారని, పంచాయతీస్థాయిలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. అనంతరం జిల్లా సీనియర్‌ సిటిజన్‌ ఫోరం సభ్యులు జగపతిరావు, ఎం.బాలయ్య, అశోక్‌కుమార్‌, నాగభూషణం, కోటిరెడ్డి తదితరులు కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జెఎల్‌బీ హరిప్రియలను మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రతి దరఖాస్తును చదివి.. అవసరమైన విచారణ చేయండి

అధికారులను ఆదేశించిన

కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా

ప్రజావాణిలో 119 దరఖాస్తుల స్వీకరణ

Advertisement
 
Advertisement
Advertisement