గంగాపురంలో ఘనంగా కాముడిదహనం | - | Sakshi
Sakshi News home page

గంగాపురంలో ఘనంగా కాముడిదహనం

Mar 2 2026 8:28 AM | Updated on Mar 2 2026 8:28 AM

గంగాపురంలో ఘనంగా కాముడిదహనం

గంగాపురంలో ఘనంగా కాముడిదహనం

హోలికి ముందు రోజు..

హోలిక అగ్నికి ఆహుతైన రోజు

బుధవారం హోలి వేడుకలు

ఒకరోజు ముందుగానే వేడుకలు

అనాదిగా వస్తున్న ఆచారం

కాముడిదహనం

జడ్చర్ల టౌన్‌: హోలి సందర్భంగా నిర్వహించే కాముడిదహనం వేడుకలను మండలంలోని ప్రసిద్ధిగాంచిన గంగాపురంలో ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. వాస్తవానికి సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాముడిదహనం జరుపు కోనున్నారు. అయితే తెలంగాణలో పేరుగాంచిన లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయాల్లో ఒక్కటైన గంగాపురంలో మాత్రం ఒకరోజు ముందుగానే ఆదివారం రాత్రి కాముడిదహనం చేశారు. పూర్వికుల నుంచి ఈ ఆనవాయితీ వస్తుంది. ఆనాదిగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం ముందురోజు వేడుకలు జరుపుకుంటున్నారు. లక్ష్మీచెన్నకేశవస్వామి కొలువై ఉండడం వల్లే ఇలా చేస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతిఏటా వసంత త్రయోదశి రోజునే కాముడిదహనం జరుపనున్నారు. అందులో భాగంగా ఆదివారం రాత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలతో వడ్రంగి ఇంటికి చేరుకుని అక్కడ కాముడి బొమ్మను తీసుకుని ఊరేగింపుగా గ్రామమధ్యలో ఉన్న సేవా మండపం వరకు చేరుకున్నారు. అప్పటికే గ్రామ మాల కులస్తులు పొలాల నుంచి తీసుకొచ్చిన పిడక నుగ్గులను పేర్చారు. కాముడి బొమ్మకు ఆలయ పూజారి పూజలు చేసిన అనంతరం పిడక నుగ్గులపై ఉంచి వేడుక జరిపారు. కాముడిదహనంతో గ్రామస్తులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. కామదహనం చేసిన బూడిదను మరుసటి రోజు గ్రామస్తులు సేకరించి ఇళ్లల్లో భద్రపరుచుకోవడం ఆనవాయితీ. ఆ బూడిదను కొబ్బరి నూనెలో కలపి చర్మవ్యాధులున్న వారు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు.

హోలికి ముందు వచ్చే పౌర్ణమిన కాముడి దహనం చేయడం ఆనవాయితీ. హోలి వేడుకలు, కామదహనానికి సంబంధించి ఆధ్యాత్మికంగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. మన్మదుడు అనే కామదేవుడిని శివుడు అగ్నికి ఆహుతిచ్చిన రోజుగా వాడుకలో ఉంది. అయితే రతీదేవి ప్రార్థనకు చలించిన శివుడు కాముడిని భౌతికంగా బతికించకుండా ప్రేమరూపంలో ప్రతిఒక్కరి మనసులో ఉండేలా వరమిచ్చాడు. అందుకు చిహ్నంగా ప్రతి ఏటా వసంతపౌర్ణమి రోజున కాముడి దహనం చేస్తుంటాం. మరుసటి రోజు వసంత కాలంలో చెట్లు చిగురించినట్లుగా ప్రతిఒక్కరిలో ప్రేమ చిగురించాలని రంగురంగులతో వసంతోత్సవం ఆడటం జరుగుతుంది.

హిరణ్యకశపుడి సోదరి హోలిక అగ్నికి ఆహుతైన రోజు కావడంతో హోలి జరుపుకోవడం ప్రారంభించారు. ఆమె అగ్నికి ఆహుతి అయినందున ఆమె పేరునే హోలి జరుపుకోవడం ప్రారంభమైంది.

సోమవారం కాముడిదహనం జరుపుకొని బుధవారం హోలి వేడుకలు జరుపుకోవాలని ఉమ్మడి జిల్లా బ్రాహ్మణ సంఘం పిలుపునిచ్చింది. మంగళవారం గ్రహణం కారణంగా వేడుకలు జరపరాదని ప్రకటించారు. అయి తే ప్రభుత్వం మాత్రం 3వ తేదీన సెలవు ప్రకటించడంతో అయోమయం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement