ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత

Mar 2 2026 8:28 AM | Updated on Mar 2 2026 8:28 AM

ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత

ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత

ఉప్పునుంతల: పురాతన ఆలయాలు, శిల్ప కళలను కాపాడుకోవాల్సిన అందరిపై ఉందని పురావస్తు పరిశోధకుడు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఉప్పరిపల్లిలో సర్పంచు బొజ్జ గీత ఆధ్వర్యంలో గ్రామ సమీపంలోని ఊర చెరువు పక్కనున్న పురాతన ఆలయాన్ని ఆయన పరిశీలించారు. 800 ఏళ్ల నాటి ఈ ఆలయానికి పూర్వవైభవం తీసుకురావడానికి కృషిచేస్తున్న సర్పంచు బొజ్జ గీత, ఆమె భర్త అమరేందర్‌రెడ్డిని అభినందించారు. శివాలయంలో చాళుక్యుల నాటి శివలింగం, వీరన్నగుడిలో కాకతీయుల కాలపు నిలువెత్తు వీరభద్రుడి విగ్రహం, మరో శివుడి విగ్రహం తల భాగం, ఆలయాల ముందు గోగ్రహణ సందర్భంగా జరిగిన ఘర్షణలో మరణించిన ఇద్దరు శిల్పాలు వెయ్యేళ్ల చరిత్రకు అద్దం పడుతున్నాయని వివరించారు. శివాలయం ముందున్న బండలపై కొత్త రాతియుగపు నాటి గొడ్డళ్లను అరగదీసిన ఆనవాళ్లు గుర్తించిన శివనాగిరెడ్డి అవి పూర్వం 4 వేల సంవత్సరాల నాటివని పేర్కొన్నా రు. గ్రామ శివారులోని కస్పాబండ దగ్గర భూమిలో కూరుకుపోయిన కందూరి చోళ భీమ చోడుని శాసనాన్ని సర్పంచు జేసీబీతో బయటకు తీయించగా ఆ శాసనాన్ని చదివి.. మామిళ్లపల్లి, ఉప్పరిపల్లికి సంబంధించిన నర్సింహస్వామి వివరాలు ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో శిల్పి వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచు శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement