ముచ్చటగా మూడోసారి
అచ్చంపేట: నగర పంచాయతీగా ఉన్న అచ్చంపేటను 2018లో అప్పటి ప్రభుత్వం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసింది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటుకు ముందు నిజాం కాలం (1954)లో అచ్చంపేట పురపాలికగా ఉండేది. అప్పట్లో నిర్వహించిన ఎన్నికల్లో తొలి పురపాలిక చైర్మన్‌గా బుచ్చికారి ఎన్నికయ్యారు. 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. నాడు అభివృద్ధికి సరిపడా నిధులు లేకపోవడంతో మున్సిపాలిటీగా ఉన్న అచ్చంపేటను 1964లో మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటుచేసి.. పుర చైర్మన్‌తోనే పరిపాలన కొనసాగించారు.1964 నుంచి 2013 వరకు మేజర్ గ్రామ పంచాయతీగా కొనసాగిన అచ్చంపేటను నగర పంచాయతీగా, మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. పురపాలికగా ఏర్పడిన తర్వాత నిర్మించిన భవనం గతేడాది కూల్చివేసి దాని స్థానంలో కొత్త భవనం నిర్మించారు. ప్రస్తుతం మూడోసారి మున్సిపల్ పోరుకు సిద్ధమైంది.
● 1954లోనే మున్సిపాలిటీగా అచ్చంపేటకు గుర్తింపు
● పరిపాలన మార్పుతో 1964లో మేజర్ జీపీగా ఏర్పాటు
● 2013లో నగర పంచాయతీ.. 2018లో మున్సిపాలిటీగా
అవతరణ
ఇదీ పరిస్థితి..
2016 మార్చి 6న జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 20/20 వార్డులు కై వసం చేసుకుంది. తొలి నగర పంచాయతీ చైర్మన్ పీఠం ఎస్టీకి రిజర్వు కావడంతో మార్చి 15న కె.తులసీరాం చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2021 మార్చి14తో ముగియడంతో 2021 ఏప్రిల్ 30న రెండోసారి ఎన్నికలు నిర్వహించగా.. బీఆర్‌ఎస్–13, కాంగ్రెస్–6, బీజేపీ ఒక స్థానం కై వపం చేసుకున్నాయి. జనరల్ స్థానం నుంచి మే 6న బీఆర్‌ఎస్‌కు చెందిన ఎండ్ల నర్సింహాగౌడ్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్‌కు చెందిన 8మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 జూలై 6న చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన గార్లపాటి శ్రీనివాసులును చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
పెరిగిన పోటీ..
రోజురోజుకు పట్టణం నలుదిక్కులా విస్తరిస్తోంది. ప్రస్తుతం 10,500 పైగా కుటుంబాలు ఉండగా.. 36,952 జనాభా ఉంది. ఇందులో ఎస్టీ జనాభా 4,858, ఎస్సీలు 2,728, ఇతరులు 28,425 మంది ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు, 50 పైగా కాలనీలు ఉండగా.. 23,139 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 11,335 మంది పురుఘలు, 11,803 మంది మహిళలు, ఒకరు ఇతర ఓటర్లు ఉన్నారు. 2016లో మొదటి సారి చైర్మన్ స్థానం ఎస్టీకి రిజర్వు కాగా.. రెండోసారి 2021లో జనరల్‌కు రిజర్వు చేశారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో ఎన్నికల్లో పోటీ పెరిగింది. అన్ని వార్డుల్లో త్రిముఖ పోటీ నెలకొంది.
పరిపాలన మార్పు ప్రభావంతో..
పరిపాలన మార్పు ప్రభావంతో అచ్చంపేట మున్సిపాలిటీ గ్రామ పంచాయతీగా మార్చాల్సి వచ్చింది. అప్పటి వరకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న అచ్చంపేట 2013 జూన్ 25న 20 వార్డులతో నగర పంచాయతీగా ఏర్పడింది. కమిషనర్, ప్రత్యేక అధికారిగా (ఆర్డీఓ) పాలనలో కొనసాగిన నగర పంచాయతీకి 2016 మార్చి 5న మొదటిసారి ఎన్నికలు జరిగాయి. 2018 మార్చి 30న తెలంగాణ ప్రభుత్వం పెద్దసంఖ్యలో పంచాయతీలను పట్టణ స్థాయికి మార్చే నిర్ణయంలో భాగంగా పలకపల్లి, లింగోటం, పులిజాల, నడింపల్లి, లక్ష్మాపూర్, చౌటపల్లి, గుంపన్‌పల్లి, బల్మూర్ మండలం పొలిశెట్టిపల్లి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసింది. ఆయా గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పటి ప్రభుత్వం 2019 జూన్ 28న చట్టసవరణ చేస్తూ.. ఆర్డినెన్స్ 4 జారీ చేయడంతో విలీన గ్రామాలు రద్దయ్యాయి. దీంతో కేవలం పట్టణ జనాభాతోనే మున్సిపాలిటీ కొనసాగుతోంది.
ముచ్చటగా మూడోసారి


