పోలింగ్ కేంద్రాల్లో నో సెల్ఫీ
కల్వకుర్తి టౌన్: సాంకేతికత పెరుగుతున్నా కొద్దీ వయస్సు తారతమ్యం, సమయం, సందర్భం లేకుండా ప్రతి ఒక్కరిలో సెల్ఫీల పిచ్చి నానాటికీ పెరుగుతుంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఎవరైనా ఓటు వేస్తూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నించటం కుదరదు. ఒకవేళ ఎవరూ చూడటం లేదు కదా అని సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీలు పూర్తిగా నిషేదం. ఓటరు నిబంధనలకు విరుద్ధగా చూపిస్తూ ఓటు వేసినట్లగా గుర్తిస్తే అధికారులు వెంటనే 49– ఎం (ఓటు రహస్యం) బహిర్గతం నియమం కింద బయటకు పంపిస్తారు. వేసిన ఓటును 17– ఏలో నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణలోకి తీసుకోరు. రూల్ నంబర్ 49– ఎన్ ప్రకారం అంధులైన ఓటర్లు తాము ఓటు వేయడానికి 18 ఏళ్లు దాటినా సహాయకుడిని వెంట తీసుకొని వెళ్లవచ్చు. సహాయకుడు అతడి ఓటును బహిరంగ పర్చనని నిబంధన–10లో ధ్రువీకరించాల్సి ఉంటుంది.


