వెట్టి చేయించుకొని చనిపోయాక వదిలేశారు
నవాబుపేట: కుటుంబపెద్దను కోల్పోయిన తమను ఆదుకోవాలని బాధిత కుటుంబసభ్యురాలు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని ఇప్పటూర్ గ్రామానికి చెందిన యాదయ్య (46) అదే గ్రామంలో గల సోలార్ విద్యుత్ ప్లాంటులో 11 ఏళ్లుగా సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. కాగా గత నెల 2న ప్లాంట్‌లో అతడు మృతి చెందాడు. అయితే బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్లాంట్ యాజమాన్యం బాధిత కుటుంబసభ్యులకు సూచించింది. అయితే పోస్ట్‌మార్టం నిర్వహించగా రిపోర్టులో కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు తేలిందని, కుటుంబపెద్దను కోల్పోయిన తమను ఆదుకుంటామని మాటా ఇచ్చిన ప్లాంట్ నిర్వాహకులు ఎటువంటి సాయం చేయకుండా రోడ్డున పడేశారని యాదయ్య భార్య బాలమణి ఆరోపించారు. చెక్కులు ఇస్తామని చెప్పి సంతకాలు తీసుకొని తీరా ఇప్పుడు రోడ్డున పడేశారని కన్నీటి పర్యంతమైంది. తన భర్త చావుకు సోలార్ ప్లాంటు యాజమాన్యమే కారణమని వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ విషయంలో జిల్లా అధికారులను సైతం కలిసి తమ గోడు వెల్లబోసుకుంటామని ఆమె వివరించింది.
న్యాయం చేయాలంటూ బాధితురాలి మొర


