కోతుల బెడదపై సమరం
జడ్చర్ల: ప్రస్తుతం జడ్చర్ల మున్సిపాలిటీకి ఎన్నికలు లేకపోవడం.. మరికొద్ది నెలల్లో ఎన్నికల సందడి మొదలయ్యే అవకాశం ఉండటంతో ఆశావహులు ఏదో రకంగా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే 4వ వార్డుకు పోటీ అభ్యర్థిగా పేర్కొంటున్న పెద్ది వెంకటేశ్ కోతుల బెడదపై సమర శంకం మోగించారు. స్థానిక వీరశివాజీ నగర్‌లో ఇళ్లలోకి కోతులు చొచ్చుకుని వస్తున్నాయని.. వాటి నుంచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అటవీశాఖ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. అయితే ఇది తమ పని కాదని.. మున్సిపల్‌శాఖ పనేనంటూ అటవీశాఖ అధికారులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు మున్సిపల్‌శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురానున్నట్లు ఈ సందర్భంగా ఆయన ‘సాక్షిశ్రీకి తెలిపారు. కాగా ఏదో ఒక సమస్యతో ఇప్పటి నుంచే ఆశావహులు జనంలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.


