గుడి కట్టు.. ఓట్లు పట్టు
వనపర్తిటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో వనపర్తిలోని 21వ వార్డులో అభ్యర్థులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తమ నివాస ప్రాంతంలో ఆంజనేయస్వామి గుడి లేకపోవటంతో ఇక్కడి ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 25 ఏళ్ల నుంచి ఎన్నికల ముందు కౌన్సిలర్ అభ్యర్థులు కట్టిస్తామని హామీ ఇచ్చి, గెలిచాక గుడిని పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. 18 ఏళ్ల క్రితం ఆలయ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టినప్పటికి ముందుకు సాగడం లేదు. నందిమల్లగడ్డతో పాటు మరో ప్రాంతంలో గుడి లేకపోవటంతో ప్రజలు వెలితీగా భావిస్తున్నారు. ఆంజనేయస్వామి లేని ఊరు ఉండకూడదన్న నమ్మకంతో గుడి ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాలని స్థానికులు పట్టుదలగా ఉన్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు వస్తుండటంతో ఇక్కడ ఆంజనేయస్వామి గుడి కట్టిన వారికే ఓటు వేస్తామని ఓటర్లు తేల్చి చెబుతున్నారు. దీంతో అభ్యర్థులు తాము కడతామని యథావిధిగా హామీ ఇస్తున్నప్పటికీ ఓటర్లు మాత్రం మరోసారి మోసపోమని తెగేసి చెబుతున్నారు.


