రాజకీయ నాటకాలు మానుకోవాలి
● ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
స్టేషన్ మహబూబ్‌నగర్: మాజీ మంత్రి ప్రజలను మభ్యపెట్టే రాజకీయ నాటకాలు ఇకనైనా మానుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చెరువుకట్టపై నిలబడి మాజీ మంత్రి చేసే నాటకీయ ప్రదర్శనలను చూసి ప్రజ లు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఒకసారి ఎ మ్మెల్యే, ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన సమ యంలో మహబూబ్‌నగర్ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణంలో విద్యాసంస్థలు, ట్రిపుల్‌టీ, ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలని అప్పటి కేసీఆర్‌ను ఒక్కసారి కూడా ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడూ ప్రజల సమస్యలపై మాట్లాడని వారు ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయ స్వార్థమేనని మండిపడ్డారు. మీ వల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోయాయో, ఎంతమంది ప్రజలు ఆవేదన చెందారో, ఉద్యమకారుల కుటుంబాలు సైతం నాడు ఎంత ఏడ్చాయో జిల్లావాసులకు బాగా తెలుసన్నారు. మెయిన్‌రోడ్డుపై కప్పు సాసర్ వాటర్ చూపించి అభివృద్ధి చేశామని చెప్పుకోవడం ప్రజలను అవమానించడమేనని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో పరిమితం కాకుండా చేతల్లో అభివృద్ధి చూపిస్తోందని తెలిపారు.. సీఎం రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి రూ.2వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయడం చరిత్రలోనే ముందడుగని అన్నారు. 2012లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో రూ.80 కోట్లతో కోయిలసాగర్ ద్వారా పట్టణానికి శాశ్వత తాగునీరు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సమావేశంలో టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, నాయకులు వినోద్‌కుమార్, చంద్రకుమార్‌గౌడ్, అమరేందర్ రాజు పాల్గొన్నారు.


