అభివృద్ధి పనులు ఎందుకు ఆపారు?
● మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాకేంద్రంలో బీఆర్‌ఎస్ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను ఎందుకు ఆపారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. గురువారం మెట్టుగడ్డలోని మార్కెట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టౌన్ హాల్ ఎందుకు ఓపెన్ చేయడంలేదని, వెయ్యి పడకల హాస్పిటల్ ఎందుకు తెరవడం లేదని ప్రశ్నించారు. ఆస్పత్రిలో వసతులు కల్పించేందుకు రూ.500 కోట్ల టెండర్లు ఎందుకు పిలవడం లేదని నిలదీశారు. హరిత హోటల్ రెండేళ్ల నుంచి ఎందుకు అలాగు ఉందని, మార్కెట్లు ఎందుకు పూర్తి చేయడం లేదు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శిల్పారామం, ట్యాంక్ బండ్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడిగా మారిపోయిందన్నారు. మైనారిటీ గురుకులాలు ఎందుకు పూర్తి చేయలేదని, మన్యంకొండ రన్‌వే పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగారు. ఇలా అనేక రకాల అభివృద్ధి పనులు ఎక్కడి అక్కడే ఆగిపోయాయన్నారు. మెట్టుగడ్డ లో మార్కెట్ మొత్తం మందు బాబులకు అడ్డాగా మారింది..కానీ దానిని పట్టించుకోవడం లేదనన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెహమాన్ తదితరులు ఉన్నారు.


