నిఘా నీడలో మున్సిపాలిటీలు
● తనిఖీల కోసం ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాల ఏర్పాటు
పాలమూరు: మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 11న నిర్వహించే కార్పొరేషన్, మున్సిపల్ పోలింగ్‌కు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఒక కార్పొరేషన్‌తో పాటు రెండు మున్సిపాలిటీలలో నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. రెండు రోజులుగా ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడానికి నిఘా బృందాలను నియమించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నంత కాలం కోడ్ ఉల్లంఘనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. అక్రమ మద్యం, పెద్ద మొత్తంలో నగదు రవాణా, ఓటర్లకు మద్యం నగదు పంపిణీ వంటి కార్యక్రమాలను అడ్డుకోవడంతో పాటు ఓటర్లను ప్రలోభపెట్టకుండా పటిష్ట చర్యలు తీసుకుంటారు.
షిఫ్టుల వారీగా అందుబాటులో..
ఒక్కో మున్సిపాలిటీలో రెండు ఎఫ్‌ఎస్‌టీ (ప్లయింగ్ స్క్వాడ్ బృందం) ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో డిప్యూటీ తహసీల్దార్, హెడ్‌కానిస్టేబుల్, వీడియోగ్రాఫర్ ఉంటారు. ఈ బృందాలు షిప్టుల వారీగా 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. కోడ్ నియమావళిని పక్కాగా అమలు చేయడం వీరి బాధ్యత. ఎన్నికల ప్రచార సమయంలో కోడ్ ఉల్లంఘనల ఫిర్యాదులపై ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు వెంటనే స్పందిస్తాయి.


