నేతల వసూళ్ల పర్వం
వైన్‌షాపులు మొదలుకొని.. వీధివ్యాపారుల దుకాణాల కేటాయింపులో జోరుగా దందా
● హాట్‌టాపిక్‌గా మారిన
కూల్‌పాయింట్స్ అడ్డాలు
● ప్రతిచోటా జోక్యం చేసుకుంటున్న కొందరు నేతలు
పాలమూరు: చిన్నపాటి వ్యాపారం చేసుకునే వారి దగ్గరి నుంచి వసూళ్ల పర్వానికి తెరలేపారు కొందరు నేతలు. ఇటీవల కాలంలో నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల ఎదుట నిర్వహించే కూల్‌పాయింట్స్ (వాటర్ బాటిల్స్, అన్ని రకాల స్నాక్స్, సిట్టింగ్ నిర్వహణ)పై తీవ్ర పోటీ నెలకొన్న క్రమంలో వాటి కేటాయింపు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుని మనవాళ్లకు ఇవ్వాలని మద్యం దుకాణాల నిర్వాహకులపై ఒత్తిడి చేయడంతో ఒకరిద్దరూ వ్యాపారులు గుడ్‌విల్‌కు దుకాణాలు విక్రయించుకొని వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో కూల్‌పాయింట్స్ తీసుకున్న వ్యక్తుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఫుట్‌పాత్‌లపై చిన్నపాటి దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగించే వారిని సైతం వదలడం లేదు. డబ్బులు ఇస్తేనే అడ్డా దొరుకుతుంది.. లేకుంటే లేదు అంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో సదరు వీధివ్యాపారులు అప్పులు చేసి అడిగినంత ముట్టచెబుతున్నారు. నేతలు అడిగిన మొత్తంలో ఇవ్వకపోతే దుకాణం లేకుండా కుటుంబం గడవటం ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతోపాటు జీవనం దెబ్బతింటుందనే భయంతో అడిగినంత ముట్టజెప్పినట్లు సమాచారం.
షెట్టర్‌కు ఒక రేటు..
నగరంలోని క్లాక్‌టవర్ దగ్గర ఎమ్మెల్యే నిధులతో పది షెట్టర్స్ నిర్మించారు. ఇదే స్థానంలో గతంలో తోపుడు బండ్లపై వీధి వ్యాపారులు పండ్లు, చెప్పుల విక్రయాలు జరిపేవారు. అయితే వాటి స్థానంలో శాశ్వతంగా షెట్టర్స్ నిర్మించడం వల్ల దాంట్లో వీధి వ్యాపారులు పండ్లు, చెప్పుల విక్రయాలు చేసుకోవడానికి అధికార పార్టీ నేతలతో మాట్లాడుకొని తీసుకున్నారు. దీంట్లో కొంత మంది పాతవారు ఉంటే మరికొందరు కొత్త వాళ్లకు ఇచ్చారు. ఈ దుకాణాల కేటాయింపులలో ఇద్దరు వ్యక్తులు కల్పించుకొని ఒక్కో షెట్టర్ ఇవ్వడానికి ఒక రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ప్రముఖ నేతతోపాటు ఒక ముఖ్య నేత దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసే వ్యక్తి ఉండటం విశేషం. ఈ ఇద్దరూ కలిసి ఒక్కో షెట్టర్ కేటాయించిన వీధి వ్యాపారుడి దగ్గర రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు నగరంలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. మళ్లీ కొత్తగా మార్కెట్ రోడ్‌లో సైతం మూడు షెట్టర్స్ నిర్మించగా వాటి కేటాయింపులలో కూడా డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇటు అధికారులతోపాటు అధికార పార్టీ పెద్దల దృష్టికి పోయిందా.. లేక అందరికి తెలిసి చేస్తున్నారా అనే విషయంపై స్పష్టత లేదు. డబ్బులు ఇచ్చిన వీధి వ్యాపారులు మాత్రం బయటకు చెప్పుకోలేక చేసిన అప్పులు తీర్చుకోలేక అవస్థలు పడుతునట్లు తెలుస్తోంది.


