ఏఎస్‌ఐ మహ్మద్‌ మోయిజుద్దీన్‌కి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ | - | Sakshi
Sakshi News home page

ఏఎస్‌ఐ మహ్మద్‌ మోయిజుద్దీన్‌కి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

Aug 15 2025 8:29 AM | Updated on Aug 15 2025 8:29 AM

ఏఎస్‌

ఏఎస్‌ఐ మహ్మద్‌ మోయిజుద్దీన్‌కి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

మహబూబ్‌నగర్‌ క్రైం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్‌నగర్‌ పోలీస్‌ శాఖలోని డీసీఆర్‌బీలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న మహ్మద్‌ మోయిజుద్దీన్‌కు ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ను భారత ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 1989లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఎంపికై న మోయిజుద్దీన్‌ ఉమ్మడి జిల్లాలోని అలంపూర్‌, తిమ్మాజిపేట, జడ్చర్ల, పెద్దకొత్తపల్లి, కోస్గి పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వహించాడు. 2012లో హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది డీసీఆర్‌బీలో పనిచేశారు. 2018లో ఏఎస్‌ఐగా పదోన్నతి వచ్చిన తర్వాత సీసీఎస్‌ మహబూబ్‌నగర్‌, హన్వాడ, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌, కోయిలకొండ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించాడు. తన విశిష్ట సేవలకు గాను ఇప్పటి వరకు 70 క్యాష్‌ రివార్డులు, 18 జీఎస్‌ఈ, 12 ప్రశంసాపత్రాలు, ఒక సేవా పతకం, 2017లో టీఎస్‌ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్‌ పథకం, 2019లో ఉత్తమ పోలీస్‌ పతకం అందుకున్నారు. ఇండియ పోలీస్‌ మెడల్‌ వచ్చిన మోయిజుద్దీన్‌ను ఎస్పీ జానకి అభినందించారు.

జాతీయ రహదారిపై నిఘా : డీఐజీ

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో భూత్పూర్‌– షేర్‌పల్లి మధ్యలో జాతీయ రహదారిపై వర్షపు నీరు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహనాలు నిలిచిపోయాయి. షేర్‌పల్లి పరిధిలో ఉన్న కోమటికుంట చెరువు అలుగు పారడంతో వరద నీరు అధికంగా జాతీయ రహదారి–44పైకి వచ్చింది. దీంతో వాహన రాకపోకలకు అడ్డుగా మారడంతో డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, ఎస్పీ జానకి గురువారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జాతీయ రహదారి కావడంతో పోలీసులు దాదాపు గంటపాటు శ్రమించి సమస్యను పరిష్కరించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తుండటంతో జాతీయ రహదారి వంటి రద్దీ మార్గాలపై నిరంతరం నిఘా పెట్టామన్నారు. వరదలలో మనుషులు, మూగజీవాలు చిక్కుకుంటే వెంటనే డయల్‌ 100కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే జిల్లాకేంద్రంలో పాలిటెక్నిక్‌ కళాశాలకు వెళ్లే అండర్‌పాస్‌ పూర్తిగా వర్షపు నీటితో మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్పీ డి.జానకి అక్కడికి చేరుకుని మోటార్లతో నీటిని బయటకు పంపించి రాకపోకలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం దివిటిపల్లి సమీపంలో అమర్‌రాజా బ్యాటరీ కంపెనీ దగ్గర తెగిపోయిన రోడ్డులో పడిపోయిన బస్సును ఎస్పీ పరిశీలించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

ఎర్రవల్లి: ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా వచ్చిన బొలెరో ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈఘటన బీచుపల్లి స్టేజీ దగ్గర గురువారం చోటుచేసుకుంది. ఇటిక్యాల ఎస్‌ఐ రవి నాయక్‌ కథనం మేరకు వివరాలిలా.. పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన అల్లాడి భాస్కర్‌గౌడ్‌ (54), అదే గ్రామానికి చెందిన మినిగోలు ఎల్లమ్మ (46) పొలం పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై బీచుపల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో బీచుపల్లి స్టేజీ దగ్గర వారు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వైపు వెళ్తున్న బొలెరో వాహనం అతివేగంతో వచ్చి వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలు కాగా.. అల్లాడి భాస్కర్‌గౌడ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్లమ్మను గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుడి కుమారుడు అల్లాడి కిరణ్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు బొలెరో డ్రైవర్‌ రెడ్డిగారి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నాడు.

పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు

గద్వాల క్రైం: నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన యువకులు ఇతర రాష్ట్రాల నుంచి రహస్యంగా గంజాయి కొనుగోలు చేసి వాటిని మైనర్లకు, విద్యార్థులకు విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు వారం రోజుల నుంచి పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం జిల్లా కేంద్రం శివారు కాలనీలో ముగ్గురు యువకులు గంజాయి తీసుకుంటున్నట్లు తెలియగా.. పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌ వారిని పట్టుకున్నారు. ముగ్గురిని డీ అడిక్షన్‌ సెంటర్‌కు తరలించి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతోపాటు ఆరా తీశారు. దీంతో గద్వాల పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు గంజాయి విక్రయినట్లు వివరించారు. నిఘా ఉంచిన పోలీసులు బుధవారం రాత్రి సదరు ఇద్దరు యువకులను పట్టుకున్నారు. గంజాయి ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎప్పటి నుంచి విక్రయిస్తున్నారని, ఎంతమంది తీసుకుంటున్నారు అనే విషయాలపై ఆరా తీశారు. అయితే ఆన్‌లైన్‌, ఇన్‌స్ర్ట్రాగాం సాయంతో రాయచూర్‌కు చెందిన గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. పట్టుబడిన ఇద్దరి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో పలు అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై పట్టణ ఎస్‌ఐను సంప్రదించగా.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నామని, తాజాగా ముగ్గురు యువకులను డి అడిక్షన్‌ సెంటర్‌కు తరలించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నామన్నారు. నిషేధిత మత్తు పదార్థాలు ఎవరైన గుట్టుగా విక్రయించిన, నిల్వ ఉంచుకున్నట్లు తెలిస్తే డయల్‌ 100 లేదా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య

వెల్దండ: ఇటీవల ఇంటర్‌ పూర్తయి.. బీటెక్‌లో చేరాల్సిన ఓ విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వెల్దండలో గురువారం చోటుచేసుకుంది. బంధువులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా.. వెల్దండకు చెందిన భారతమ్మ, కృష్ణయ్య దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు శివకుమార్‌(17) సంతానం. కుమార్తె బీఈడీ చదువుతుండగా.. కుమారుడు శివకుమార్‌ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో ఇటీవల ఇంటర్‌ పూర్తి చేశాడు. బీటెక్‌లో చేరాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకుగాను తండ్రి కృష్ణయ్య హైదరాబాద్‌లోని ఓ స్వీట్‌షాపులో పనిచేస్తున్నాడు. ఇదిలాఉండగా, తల్లి భారతమ్మ గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాగర్‌కర్నూల్‌కు సొంత పని మీద వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడు శివకుమార్‌ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు ఇంటి తలుపులు తీసి ఉండడం చూసి లోపలికి వెళ్లి చూడగా.. అప్పటికే మృతిచెందాడు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులను సంప్రదించగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఇదిలాఉండగా, విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

మృతులు

భాస్కర్‌గౌడ్‌, ఎల్లమ్మ

ఏఎస్‌ఐ మహ్మద్‌ మోయిజుద్దీన్‌కి  ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌1
1/4

ఏఎస్‌ఐ మహ్మద్‌ మోయిజుద్దీన్‌కి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

ఏఎస్‌ఐ మహ్మద్‌ మోయిజుద్దీన్‌కి  ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌2
2/4

ఏఎస్‌ఐ మహ్మద్‌ మోయిజుద్దీన్‌కి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

ఏఎస్‌ఐ మహ్మద్‌ మోయిజుద్దీన్‌కి  ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌3
3/4

ఏఎస్‌ఐ మహ్మద్‌ మోయిజుద్దీన్‌కి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

ఏఎస్‌ఐ మహ్మద్‌ మోయిజుద్దీన్‌కి  ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌4
4/4

ఏఎస్‌ఐ మహ్మద్‌ మోయిజుద్దీన్‌కి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement