
డీసీసీబీ పదవీకాలం పొడిగింపు
రైతులకు సేవచేసే అవకాశం
● ఆరు నెలలపాటు కొనసాగనున్న ప్రస్తుత పాలకవర్గాలు
● మరోసారి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల కాల పరిమితి ప్రభుత్వం పొడిగించింది. మరో ఆరు నెలలపాటు ప్రస్తుతం ఉన్న పాలక వర్గాలే కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల క్రితం (2020 ఫిబ్రవరి 15న) సహకార సంఘాల ఎన్నికలు జరిగి పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. వీటి గడువు శుక్రవారంతో ముగియడంతో ప్రభుత్వం పాలకవర్గాల గడువును రెండోసారి మరో ఆరు నెలలు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర కో ఆపరేషన్, సహకార సంఘాల రిజిస్ట్రార్ కమిషనర్ కె.సురేంద్ర మోహన్ గురువారం జీఓ 386 జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 78 పీఏసీఎస్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం సహకార సంఘాల గడువును పెంచడంతో డీసీసీబీ చైర్మన్‌గా మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి మరో ఆరునెలల పాటు కొనసాగనున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్‌ల చైర్మన్లు కూడా యథావిధిగా కొనసాగుతారు.
రైతులకు మరో ఆరు నెలలు సేవ చేసే అవకాశం లభించింది. పదవీకాలం పొడిగించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్‌రావుకు కృతజ్ఞతలు. ఈ అవకాశంతో రైతులకు మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తా.
– మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, చైర్మన్, డీసీసీబీ

డీసీసీబీ పదవీకాలం పొడిగింపు