
ఈజీ మనీ ఆశచూపి రూ.2 లక్షలు మోసం
● ప్రధాన సూత్రదారుడు స్నేహితుడే..
● ఇద్దరు నిందితులను
రిమాండ్‌కు తరలింపు
మహబూబ్‌నగర్ క్రైం: నా దగ్గర రాజకీయ నాయకులకు సంబంధించిన బ్లాక్ మనీ చాలా ఉందని.. రూ.లక్ష ఇస్తే రూ.5లక్షలు ఇస్తానని స్నేహితుడిని నమ్మించారు. రూ.2లక్షలు తీసుకొని.. డమ్మీ నోట్లు ఇచ్చి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక్క రోజులోనే ఇద్దరు నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నారాయణపేట జిల్లాకు చెందిన ఆశప్పకు 20రోజుల కిందట నవాబ్‌పేట మండలం పోమాలి గ్రామానికి చెందిన కె.రాములు ఫోన్ చేసి పరిచయం ఉన్న వ్యక్తి మాదిరిగా మాట్లాడాడు. నా దగ్గర రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఉపయోగించే, పంపిణీ చేసే బ్లాక్‌మనీ ఉందని, మీరు రూ.2లక్షలు ఇస్తే రూ.10లక్షలు ఇస్తానని చెప్పాడు. జరిగిన విషయాన్ని ఆశప్ప అతని స్నేహితుడు అయిన వెంకటరాములుకు చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి ఈనెల 10న మహబూబ్‌నగర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఎల్లమ్మ గుడి దగ్గరకు వచ్చారు.
రూ.2లక్షలు తీసుకొని..
డమ్మీ నోట్లు ఇచ్చి..
ఈమేరకు కె.రాములు వారిని కలిసి వారి ఇద్దరికి చేరో రూ.500 నోట్ ఇచ్చి ఇలాంటి డబ్బులు నా దగ్గర చాలా ఉన్నాయని నమ్మించాడు. దీంతో కె.రాములు ఇచ్చిన నోట్లు తీసుకుని కోస్గికి వెళ్లిన ఆ ఇద్దరూ నోట్లు చెక్ చేసుకోగా ఒరిజినల్ అని తేలడంతో నమ్మారు. దీంతో ఈ నెల 12న ఆశప్ప రూ.2 లక్షల నగదు తీసుకుని రాగా వెంకట్‌రాములు రూ.2లక్షల విలువ చేసే డమ్మి(ఫేక్) నోట్లు తీసుకుని మహబూబ్‌నగర్ బస్టాండ్‌కు వచ్చారు. ఆశప్ప అతని దగ్గర ఉన్న రూ.2లక్షల నగదు, వెంకటరాములు తన వెంట తెచ్చిన రూ.2లక్షల డమ్మీ నోట్ల కట్టాలను కవర్‌లో పెట్టి కె.రాములుకు అందించారు. ఆ డబ్బులు తీసుకున్న కె.రాములు మీకు ఇవ్వాల్సిన రూ.10లక్షలు కారులో ఉన్నాయని చెప్పి తెస్తానని రోడ్డు దాటివెళ్లిపోయి తన ఫోన్ స్వీచ్ ఆఫ్ చేశాడు. దీంతో మోసపోయిన అని గ్రహించిన ఆశప్ప టూటౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఒక్కరోజు వ్యవధిలో కేసు చేధించినట్లు డీఎస్పీ తెలిపారు.