
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలనుపునరావాస కేంద్రాలకు తరలించాలి
● కలెక్టర్ విజయేందిర
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. గ్రామస్థాయి సిబ్బందితో మొదలుకుని జిల్లా అధికారి వరకు అందరూ క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితి దృష్ట్యా అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలను పునరావాస కేంద్రాల్లోకి తరలించాలని సూచించారు. అన్ని గ్రామాల్లో పునరావాస సహాయ కేంద్రాలను గుర్తించి.. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని తెలిపారు. అత్యవసర సమయంలో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఆపదమిత్ర వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చేపల వేట, ఈత కోసం చెరువులు, కాల్వలు, రిజర్వాయర్లలోకి ఎవరూ దిగకుండా కట్టడి చేయాలని.. అవసరమైన చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కాజ్‌వేల వద్ద వాగులను దాటకుండా భారికేడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లు, ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని.. అవసరమైన ఔషధ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని 27 ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కువగా వస్తున్నాయని.. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు విస్తృతంగా చేపట్టాలన్నారు. భారీ వర్షాల వల్ల ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే తక్షణమే స్పందించి పునరుద్ధరించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ రమేశ్‌ను కలెక్టర్ ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ.. జిల్లాలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఏమైనా ప్రమాదాలు సంభవించినా, అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కంట్రోల్‌రూం 08542 – 241165 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. వీసీలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, నర్సింహారెడ్డి, డీపీఓ పార్థసారధి, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.
సత్వరం పరిష్కరించాలి..
మహబూబ్‌నగర్ రూరల్: వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 19 మంది కలెక్టర్‌కు ఫిర్యాదులు అందజేశారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జరీనాబేగం, డీఎంహెచ్‌ఓ డా.కృష్ణ, ఏపీడీ శారద, గృహనిర్మాణ శాఖ పీడీ వైద్యం భాస్కర్, అర్బన్ తహసీల్దార్ ఘన్సీరామ్ పాల్గొన్నారు.
యూరియాను పక్కదారి పట్టిస్తే సహించం..
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): యూరియా ను ఎవరైనా పక్కదారి పట్టిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ విజయేందిర అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్, మన గ్రోమర్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాయితీ యూరియాను కేవలం వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలని, ఇతరాత్ర అవసరాలకు కాదన్నారు. పీఏసీఎస్‌లు, రైతు సేవా కేంద్రాల్లో విక్రయించే ఎరువులు, యూరియాపై అధికారులు నిఘా ఏర్పాటుచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఏఓ బి.వెంకటేశ్, ఏఓ శ్రీనివాసులు ఉన్నారు.