
రికవరీ అయ్యేనా..?
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): అత్యవసర పరిస్థితుల్లో మహిళా సంఘాల సభ్యులను సీ్త్రనిధి రుణాలు ఆదుకుంటున్నాయి. అయితే వాటిని తిరిగి చెల్లించడంలో అంత శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సీ్త్రనిధి రుణాల తిరిగి చెల్లింపులో సంఘాల సభ్యులు మొండికేసినట్లు కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల కొత్త వారికి అవకాశం లేకుండాపోతుందని పలువురు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా రూ.16.61 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. వీటిని రికవరీ చేసేందుకు డీఆర్‌డీఓ ఆధికారులు తలలు పట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో గట్టిగా అడిగినా వసూలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఏడాది కాలంగా సీ్త్రనిధి రుణాలు పెండింగ్‌లో పడటంతో జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లోని మిగతా సభ్యులకు కొత్త రుణాలు అందని పరిస్థితి నెలకొంది. సంఘాల్లో ఒకరిద్దరు కిస్తులు కట్టని కారణంగా మిగతా ఎవరికీ రుణాలు అందవు. సంఘాల్లో లావాదేవీలు సక్రమంగా కొనసాగితేనే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. తీసుకున్న రుణాలను కొందరు కట్టకపోయినా ఆ ప్రభావం అందరిపై పడుతుంది.
ప్రత్యేక డ్రైవ్‌కు ఆదేశాలు..
ఈ శాఖపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముఖ్యంగా సీ్త్రనిధి రుణాల రికవరీపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఈ మేరకు సీ్త్రనిధి రుణాల రికవరీపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మొండి బకాయిలను రికవరీ చేసేందుకు జిల్లాలో ఆరుగురు సీఆర్పీలను నియమించారు. వీరు బకాయిలు ఉన్న మండలాల్లో పర్యటించి వసూలుపై దృష్టిసారిస్తారు.
అత్యధికంగా హన్వాడలో..
వాస్తవంగా సీ్త్రనిధి రుణాలను ప్రతినెల సక్రమంగా చెల్లించే గ్రూపులకే ఇస్తారు. వారి పొదుపు మూలధనం ఆయా కిస్తులకు క్రమం తప్పకుండా జమ అయ్యే వారికే వడ్డీలేని రుణాలు అందిస్తారు. క్రమం తప్పక రుణాలు చెల్లించిన వారు కూడా ప్రస్తుతం మొండికేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 6,737 సంఘాల నుంచి రూ.33.76 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.17.06 కోట్లు వసూలు కాగా.. మరో రూ.16.61 కోట్ల బకాయిలు ఉన్నాయి. జిల్లాలోని ఇతర మండలాలతో పోల్చితే హన్వాడలో అత్యధికంగా సీ్త్రనిధి బకాయిలు ఉన్నాయి. ఏకంగా రూ.2.01 కోట్ల మేర పేరుకుపోయాయి. ఈ మొత్తం 366 సంఘాలు చెల్లించాల్సి ఉన్నాయి.
జిల్లాలో మొండికేసిన ‘సీ్త్రనిధి’ బకాయిలు
పాతవి పేరుకుపోవడంతో కొత్త రుణాలకు బ్రేక్
స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు ఉన్నతాధికారుల ఆదేశాలు
ఆరుగురు ఏపీఎంలతో క్షేత్రస్థాయిలో వసూలుకు చర్యలు

రికవరీ అయ్యేనా..?