
ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ డి.జానకి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు, మినీ ట్యాంక్‌బండ్ వద్ద వరద ప్రవాహాన్ని ఎస్పీ పరిశీలించారు. క్రమంగా వరద ఉధృతి పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై విద్యుత్ తీగలు తెగిపోవడం, చెట్లు కూలడం, రహదారులు దెబ్బతినడం వంటి అవకాశాలు ఉన్నాయని.. అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ బృందాలు, పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎస్పీ వెంట సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య ఉన్నారు.
● నషాముక్త్ భారత్ అభియాన్ వార్షికోత్సవం సందర్భంగా ధర్మాపూర్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ఎస్పీ డి.జానకి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. యువత, విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాగా, జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీలు రమణారెడ్డి, శ్రీనివాసులు, ఏఓ రుక్మిణి, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేశ్, రవి, ఎస్‌బీ సీఐ వెంకటేశ్ పాల్గొన్నారు.
● స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా టీనేజర్స్, యువత బైక్‌లపై ముగ్గురు, నలుగురు వెళ్తూ.. అధిక శబ్ధాలతో రాష్ డ్రైవింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పాఠశాల విద్యార్థులు, చిన్నారులు రోడ్లపై ర్యాలీలు నిర్వహిస్తారని.. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. దురుసుగా, హారన్స్ కొడుతూ బైక్‌లను నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.