ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు
ఖిల్లాఘనపురం: అర్హత లేకపోయినా కొంతమంది ఆర్‌ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ.శ్రీనివాసులు హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా గురువారం ఖిల్లాఘనపురం వచ్చిన ఆయన డీఈఎంఓ రవికుమార్‌తో కలిసి గ్రామంలోని ప్రాథమిక చికిత్స కేంద్రాలను పరిశీలించారు. స్థాయికి మించి వైద్యం అందిస్తున్న 9 క్లినిక్‌లను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్‌ఎంపీలు మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్లినిక్‌లను ఏర్పాటు చేసుకొని అవగాహన లేని వైద్యం చేస్తూ ఇష్టారీతిగా డబ్బులు లాగుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా కమీషన్లకు ఆశ పడి అవసరం లేకపోయినా ఇతర ప్రైవేట్ ఆస్పత్రులకు, ల్యాబ్ టెస్టులకు రిఫర్ చేస్తున్నారన్నారు. అలాంటి ప్రథమ చికిత్స కేంద్రాలు సుశ్రుత క్లినిక్, నరేందర్‌గౌడ్, బాల్‌రాజ్, భాగ్యమ్మ, నరేందర్‌బాబు, శ్రీనివాసులు, నాగేశ్వర్‌రెడ్డి, వెంకటేష్ కు చెందిన మొత్తం 9 క్లినిక్‌లను సీజ్ చేశామన్నారు.
ముమ్మరంగా దాడులు
స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు పాన్‌గల్‌లో 2, శ్రీరంగాపురంలో 2, పాలెంలో 2, వనపర్తిలో 5, ఖిల్లాఘనపురంలో 9, ఆత్మకూర్‌లో 1, బలిజపల్లిలో 2 మొత్తంగా 23 క్లినిక్‌లను సీజ్ చేశామన్నారు. ఆర్‌ఎంపీలు అవగాహన లేకుండా ఇచ్చే మందుల వలన ప్రజలకు ప్రాణాపాయం ఏర్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈఎంఓ రవికుమార్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ.శ్రీనివాసులు
ఖిల్లాఘనపురం మండలంలో 9 క్లినిక్‌ల సీజ్


