12.75 క్వింటాళ్ల నకిలీ విత్తనాల పట్టివేత
మల్దకల్: మండలంలోని కుర్తిరావుల చెర్వులో 12.75 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ నందీకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సీడ్ సబ్ ఆర్గనైజర్ శ్రీను అలియాస్ రాజు గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం దగ్గర ఏర్పాటు చేసిన షెడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన 12.75క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో షెడ్డులో నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని, సీడ్ సబ్ ఆర్గనైజర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ దాడులలో వ్యవసాయాధికారి రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ గోపాల్ నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


