డబ్బు కోసం తన ముగ్గురు పిల్లలను కిడ్నాప్‌ చేసిన తండ్రి | - | Sakshi
Sakshi News home page

కిడ్నాపైన చిన్నారులు.. క్షేమంగా ఇంటికి

Jan 9 2024 12:30 AM | Updated on Jan 9 2024 8:45 AM

- - Sakshi

జడ్చర్ల: తాగుడు, జల్సాలకు అలవాటు పడిన ఓ తండ్రి తన ముగ్గురు బిడ్డలను అమ్మకానికి హైదరాబాద్‌కు తీసుకెళ్లగా.. పోలీసులు తల్లి చెంతకు చేర్చిన ఘటన జడ్చర్లలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్‌బాబు కథనం ప్రకారం.. స్థానిక నిమ్మబావిగడ్డకు చెందిన హబీబున్నీసాకు భూత్పూర్‌ మండలం తాడిపత్రికి చెందిన రఫీక్‌తో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల రుమానాబేగం, మూడేళ్ల రమీజ్‌, ఏడాది షోయబ్‌ పిల్లలున్నారు.

ఈ కుటుంబం కొంతకాలంగా గౌరీశంకర్‌కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. రఫీక్‌ తాగుడు, జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం ఆదివారం తన ముగ్గురు పిల్లలను దుస్తులు కొనిస్తానంటూ నమ్మబలికి బైక్‌పై హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి భార్యకు ఫోన్‌చేసి పిల్లలను కిడ్నాప్‌ చేశానని, తనకు డబ్బులు కావాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రఫీక్‌ ఫోన్‌ ట్రాక్‌చేసి హైదరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించగా.. చంచల్‌గూడ సమీ పంలో అదుపులోకి తీసుకున్నారు. తండ్రి ఇచ్చి న ఆధారాలతో యాకుత్‌పురాలో ఓ కారులో పిల్లలను పోలీసులు, బంధువులు గుర్తించారు.

కారులో ఉన్న వారిని ప్రశ్నించగా రఫీక్‌ తమకు రూ.9 లక్షలు ఇవ్వాల్సి ఉందని.. డబ్బులు తీసుకొస్తానంటూ పిల్లలను అప్పగించి వెళ్లాడని చెప్పి పరారయ్యారు. కాగా.. తన పిల్లలను రూ.9 లక్షలకు విక్రయించే ప్రయత్నం చేశాడని భార్య ఆరోపించింది. గోవాలో ఉంటున్న తన భర్త రఫీక్‌ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వేధిస్తుంటాడని వాపోయింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement