Telangana Crime News: ప్రేమించి.. నమ్మించి.. మోసంచేసిన యువకుడు!
Sakshi News home page

ప్రేమించి.. నమ్మించి.. మోసంచేసిన యువకుడు!

Jan 4 2024 12:36 AM | Updated on Jan 4 2024 9:26 AM

- - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శారద

బల్మూర్‌: ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి.. పెద్దల సమక్షంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు.. బల్మూర్‌ మండలంలోని బాణాలకు చెందిన కోట్ర శారద, అదే గ్రామానికి చెందిన మల్లేష్‌లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఈ క్రమంలో ఏడాది కిందట యువతి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో బలవంతంగా వివాహం చేశారు. అతడికి విడాకులు ఇవ్వాలని.. నేను పెళ్లి చేసుకుంటానని మల్లేష్‌ నమ్మించడంతో మూడు నెలల కిందట శారద తన భర్తకు విడాకులు ఇచ్చింది. అనంతరం మల్లేష్‌ వద్ద పెళ్లి ప్రస్తావన తేగా.. అతడు నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఈ క్రమంలో బుధవారం ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు బల్మూర్‌లో పంచాయితీ పెట్టి మాట్లాడుతుండగా.. మల్లేష్‌ పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పడంతో పాటు కొందరు పెద్దలు శారదను దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె.. తన వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ విషయంపై యువతితో పాటు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి నిరాకరిస్తున్నారని, ప్రేమికుడితో పెళ్లి చేయించాలని కోరుతున్నారని ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement