నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆగస్టు 31 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ డా. వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలు, భారీ సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఏ మాత్రం ఉపేక్షించబోమని.. 30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ సంస్థ, సంఘం, వ్యక్తి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే సంబంధిత పోలీసు అధికారులను ముందుగానే సంప్రదించి అనుమతి పొందాలన్నారు. చట్టాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యతని.. ప్రజలందరూ పోలీసుశాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.
11 యూనిట్లలోవిద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక నుంచి వరదనీరు భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు ఆదివారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్లు చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 37.781 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రస్తుతం 33 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి వదులుతున్నామని చెప్పారు.
మెరిసిన జిల్లా క్రీడాకారులు
నారాయణపేట ఎడ్యుకేషన్: నేపాల్‌లోని ఖాట్మండులో ఉన్న బుద్ద నీలకంఠ మితేరి స్పోర్ట్స్‌హబ్‌లో గత నెల 29 నుంచి 31వ తేదీ వరకు జరిగిన 3వ అంతర్జాతీయ మిక్స్‌డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్–2026లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించినట్లు కోచ్ నానక్‌రామ్ ఆదివారం తెలిపారు. జిల్లాకేంద్రానికి చెందిన విశాల్‌కుమార్ అండర్–14/70, ధన్వాడ మండలం మడిగెలమూలతండాకు చెందిన సంతోష్ అండర్–18/55, ఉట్కూర్‌కు చెందిన విజయ్‌కుమార్ అండర్–17/62, ఉట్కూర్ మండలం లక్ష్మీపల్లికి చెందిన శ్రీరాం అండర్–17/50 విభాగంలో రజత పతకాలు సాధించారన్నారు. అదేవిధంగా తనకు బెస్ట్ రిఫరీ అవార్డు లభించిందని.. పతకాలు, ప్రశంసాపత్రాలను ఖాట్మాండు మేయర్ మిఠారాం చేతుల మీదుగా అందుకున్నామని వివరించారు.


