గుట్టుగా గుట్టలు ఖాళీ..! | - | Sakshi
Sakshi News home page

గుట్టుగా గుట్టలు ఖాళీ..!

Aug 3 2026 1:13 AM | Updated on Aug 3 2026 1:13 AM

ధన్వాడ: చూసేందుకు రాళ్లను పగలకొట్టి జీవనోపాధి పొందుతున్నారు అన్నట్లు కనిపిస్తోంది.. సరిగా పరిశీలిస్తేగాని తెలియదు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నట్లు. మండలంలోని రామకిష్టాయిపల్లి సమీపంలో ఉన్న గుట్టలపై మరికల్‌ మండలానికి చెందిన కొందరు అక్రమార్కుల కన్నుపడింది. గుట్టపై వరకు యంత్రాల సాయంతో రోడ్డు నిర్మించుకొని రోజు రాత్రిళ్లు బాంబులతో పేలుళ్లు జరుపుతున్నారు. తర్వాత వాటిని యంత్రాలతో కట్‌చేసి ఇంటి నిర్మాణానికి వినియోగించే రాళ్లుగా మారుస్తున్నారు. యంత్రాల వినియోగానికిగాను పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల నుంచి విద్యుత్‌ను వినియోగిస్తున్నారు.

ఒకరినిచూసి మరొకరు..

వడ్డెర కులానికి చెందిన ఒకరిద్దరు సుత్తెలతో గుండ్లను పగులగొట్టి రాళ్లుగా మార్చి అమ్మకాలు జరిపేవారు. ట్రాక్టర్‌లో 250 రాళ్లు పడుతాయి. వీటిని చేసేందుకు నెల సమయం పట్టేది. ప్రస్తుతం అక్రమార్కులు ఇక్కడ సుమారు 50 మంది కూలీలు, యంత్రాలతో పనులు చేయిస్తున్నారు. ట్రాక్టర్‌ రాయికి రూ.7 వేలు తీసుకుంటున్నారు. ఇలా రోజుకు 10 ట్రాక్టర్ల వరకు రాయిని అక్రమంగా విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరకపోగా కేవలం కాంట్రాక్టర్లు మాత్రమే బాగుపడుతున్నారు. మరికల్‌కు చెందిన కొందరు కాంట్రాక్టర్లుగా మారి కూలీలకు నామమాత్రపు డబ్బులిస్తూ వారితో పనులు చేయించుకుంటున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఈ దందా కొనసాగుతున్నా అటుగా వెళ్లే అధికారులకు కనిపించడం లేదా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

రాయికి రూ.25..

ధన్వాడ, మరికల్‌ మండలాల్లో జరిగే ఇంటి నిర్మాణాలకు ఇక్కడి నుంచే రాళ్లు వెళ్తాయి. ఒక్కో రాయిని రూ.25కు విక్రయిస్తున్నారు. రోజుకు వెయ్యి రాళ్ల వరకు యంత్రాలకు కట్‌చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతుండటంతో గిరాకీ జోరుగా సాగుతోంది. మరికల్‌కు చెందిన ఓ వ్యక్తి 20 మంది కూలీలతో పనులు చేయిస్తున్నట్లు సమాచారం. ఇది చూసిన మరికొందరు దానికి పక్కనే ఉన్న మరోగుట్టకు రాళ్లను తవ్వడం ప్రారంభించారు. గుట్ట నుంచి రాయిని తరలించాలంటే మైనింగ్‌ అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కాని ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టను తవ్వడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్‌ అధికారుల

పర్యవేక్షణ కరువు..

గుట్టలను పగులగొట్టిన రాయిగా మార్చేందుకు గతంలో సుత్తెతో కొట్టేవారు. కాని ఇప్పుడు యంత్రాలను వినియోగిస్తున్నారు. ఇందుకు పక్కనే ఉన్న వ్యవసాయ బోరుబావుల నుంచి విద్యుత్‌ కనెక్షన్లు వాడుకుంటున్నారు. ఉచిత విద్యుత్‌ను దుర్వినియోగం చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. గుట్టను పేల్చే సమయంలో పెద్ద శబ్ధాలు వస్తున్నాయని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

యంత్రాలతో తొలిచి అమ్మకాలు

రైతుల పొలాల నుంచి ఉచిత విద్యుత్‌ వినియోగం

పట్టించుకోని మైనింగ్‌, రెవెన్యూ అఽధికారులు

ప్రభుత్వ ఆదాయానికి గండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement