వరద వస్తే.. దారి సాగదు | - | Sakshi
Sakshi News home page

వరద వస్తే.. దారి సాగదు

Aug 3 2026 1:13 AM | Updated on Aug 3 2026 1:13 AM

జడ్చర్ల: వర్షాకాలంలో చెరువులు, కంటలు అలుగు పారిన సందర్భాలతో పాటు దుందుభీ వాగు పరువళ్లు తొక్కితే నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలచిపోతాయి. చుట్టూ కిలోమీటర్ల మేర తిరిగి వెళ్తే తప్ప ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి నియోజకవర్గంలోని పలు గ్రామాలు, తండాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. సాహసం చేసి వరద ప్రవాహాన్ని దాటేద్దామనుకున్న వారి ప్రాణా లు గాల్లో తేలే పరిస్థితి నెలకొంది. గతేడాది ఇలాగే ధైర్యం చేసి కిష్టారం, అంబటాపూర్‌ రోడ్డుపై పారుతున్న అలుగును దాటబోయిన భార్యాభర్తలు వరద ఉధృతిలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు.

నియోజకవర్గంలో..

దుందుభీ వాగు ఉధృతంగా ప్రవహిస్తే కొండేడు–తుపుడగడ్డతండా, లింగంపేట–నల్లకుంటతండా, ఎక్వాయపల్లి–లింగందన, రాజాపూర్‌ మండలంలోని దొండ్లపల్లి–ఇప్పటూరు, రాయపల్లి–కుచ్చర్‌కల్‌, కొత్తూరు–వెలుగొమ్ముల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. కిష్టారం–అంబటాపూర్‌ మధ్య కూడా బ్రిడ్జి లేకపోవడంతో రాకపోకలు ఇబ్బందిగా మారింది. పోలేపల్లి, కిష్‌ట్రాం మధ్య చెరువు అలుగు పారిన సమయంలో రాకపోకలు నిలిచిపోయి ఉదండాపూర్‌, వల్లూరు మీదుగా జడ్చర్లకు చేరుకోవాల్సి ఉంటుంది. నసరుల్లాబాద్‌ చెరువు అలుగు పారితే లోతట్టు ప్రాంతంలోని అల్వాన్‌పల్లి, తంగెళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తుతాయి. నెక్కొండ–బైరంపల్లి, నవాబ్‌పేట మండలంలోని వీరశట్పల్లి నుంచి దయాపంతులపల్లి మీదుగా హాజీపూర్‌ వెళ్లే మార్గంలో, నవాబ్‌పేట–దయాపంతులపల్లి, మల్లారెడ్డిపల్లి–కారూర్‌ మధ్యన బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మిడ్జిల్‌ మండలంలో వల్లభురావుపల్లి నుంచి చౌటకుంటతండా మీదుగా వేముల మార్గంలో బ్రిడ్జి నిర్మాణం చేపడితే రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా దొడ్డిపల్లి, రుద్రారం సమీపంలోని రాజమోని వంపు, కూచూర్‌ వద్ద ఆకులోనికుంట, చెన్నారెడ్డిపల్లి వద్ద లెంకల చెరువు అలుగు, చెన్నారెడ్డిపల్లి–రుక్కంపల్లి, కారూరు–ఇప్పటూర్‌ మధ్య కల్వర్టులు, కారూరు ఆంజనేయస్వామి ఆలయం ఎదుట అలుగులు ప్రమాదభరింతగా ఉన్నాయి.

ప్రతిపాదనలకే పరిమితం

నియోజకవర్గంలో వంతెనల నిర్మాణం చేపట్టేందుకు గతేడాది ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంబంధిత రాష్ట్ర పంచాయత్‌రాజ్‌ శాఖకు ప్రతిపాదనలు పంపించారు. జడ్చర్ల మండలంలోని కొండేడు–తుపుడగడ్డతండా బ్రిడ్జికి రూ.4.50 కోట్లు, బాలానగర్‌ మండలంలోని శేరిగూడ–బోడ జానంపేట బ్రిడ్జికి రూ.6 కోట్లు, నవాబ్‌ేపేట మండలంలోని వీరశట్పల్లి నుంచి దయాపంతులపల్లి మీదుగా హాజీపూర్‌ వెళ్లే మార్గంలో బ్రిడ్జి ఏర్పాటుకు రూ.2.40 కోట్లు, రాజాపూర్‌ మండలంలోని రాయపల్లి–కుచ్చర్‌కల్‌ రోడ్డు బ్రిడ్జికి రూ.6 కోట్లు మంజూరుకు ప్రతిపాదించారు.

కలెక్టర్‌ ప్రతిపాదించినా..

గతేడాది కిష్టారం–అంబటాపూర్‌ గ్రామాల మధ్య అలుగు పారుతున్న సమయంలో అంబటాపూర్‌కు చెందిన భార్యాభర్తలు తానెం బాలయ్య, రాములమ్మ కిష్టారం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా వరద ప్రవాహాన్ని దాటుతు ప్రవాహంలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో సంఘటన స్థలానికి వచ్చిన అప్పటి కలెక్టర్‌ విజయేందిర బోయికి వంతెన నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్పినా నేటి వరకు హామీ నెరవేరకపోవడం గమనార్హం

రాకపోకలు బంద్‌ అవుతాయి

దుందుభీ వాగు ఉధృతి పెరిగిన ప్రతిసారి రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నాము. దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కొన్నేళ్లుగా కోరుతున్నా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. గత ప్రభుత్వం హయాంలోనూ బ్రిడ్జి నిర్మిస్తామంటూ ప్రకటించినా.. కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికై నా బ్రిడ్జి నిర్మించేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలి.

– జర్పుల హరిలాల్‌, తుపుడగడ్డతండా

తాజాగా కొన్నింటికి నిధులు..

జడ్చర్ల, మిడ్జిల్‌ మండలాల పరిధిలోని కొన్ని వంతెనల నిర్మాణానికి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి మిడ్జిల్‌కు వచ్చిన సందర్భంగా నిధులు మంజూరు చేశారు. దుందుభీ వాగుపై నెక్కొండ–బైరంపల్లి బ్రిడ్జికి రూ.4.50 కోట్లు, వస్పుల చెక్‌డ్యాం, బ్రిడ్జికి రూ.8.50 కోట్లు మంజూరు చేయగా.. ఎక్వాయపల్లి–లింగందన బ్రిడ్జికి రూ.3 కోట్లు, లింగంపేట–నల్లకుంటతండా బ్రిడ్జికి రూ.4.50 కోట్లు, వల్లభురావుపల్లి–వేముల బ్రిడ్జికి రూ.10.20 కోట్లు మంజూరు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement