మందకొడిగా ప్రారంభమై.. | Sakshi
Sakshi News home page

మందకొడిగా ప్రారంభమై..

Published Fri, Dec 1 2023 3:00 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ఉమ్మడి పాలమూరులో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగాల్సి ఉండగా, పలు పోలింగ్‌ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించాయి. ఫలితంగా నిర్దేశిత సమయం సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత కూడా పలు కేంద్రాల్లో ఓటర్లు బారులు దీరారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలను ఆయా ప్రాంతాల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. చెదురుముదురు ఘటనలు మినహా.. పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు కొనసాగినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తుండగా.. అభ్యర్థులు ఎవరికి వారు తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.

మందకొడిగా ప్రారంభమై..

ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాగా.. 11 గంటల వరకు మందకొడిగా సాగింది. ఆ తర్వాత కొంత ఊపందుకున్నప్పటికీ.. మధ్యాహ్నం మూడు తర్వాత మళ్లీ నెమ్మదించింది. చివరలో మళ్లీ ఓటర్లు ఒక్కసారిగా పోలింగ్‌ కేంద్రాల కు పోటెత్తారు. కొన్ని చోట్ల రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత కూడా ఓటర్లు క్యూలో నిల్చొన్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా.. కల్వకుర్తిలో పోలింగ్‌ శాతం అత్యధికంగా 83.23 నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. గద్వాల (82.42శాతం), దేవరకద్ర (82.33), జడ్చర్ల (81.18)లో 80శాతానికి పైగా పోలింగ్‌ శాతం నమోదైంది. అత్యల్పంగా మక్తల్‌ నియోజకవర్గంలో 69.12 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement