ప్రలోభాలకు గురి చేస్తే..

- - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం: అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాల తాయిళాలు, కానుకలు అందిస్తుంటారు. అయితే ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా ఎన్నికల చట్టం ప్రకారం నేరమే. ప్రభావితం చేసిన వారిపై భారతీయ శిక్షాస్మృతి, ప్రజాప్రాతినిధ్య చట్టం (రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ యాక్ట్‌)– 1951, ఎకై ్సజ్‌ చట్టం–1968 ప్రకారం..పలు రకాల విధుల్లో ఉన్న అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. జరిమానాలతోపాటు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.

అబద్ధాలతో ప్రచారం..

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అబద్ధాలు చెబుతూ ప్రచారం చేస్తే నేరమే అవుతోంది. లేని వాటిని ఉన్నట్లుగా చెప్పడం, పోటీ చేసే రాజకీయ ప్రత్యర్థిపై తీవ్రమైన నిందలు వేస్తూ అబద్ధాలు చెప్పడం నేరంగా పరిగణిస్తారు. అందుకు ఐపీసీ 171(జీ) ప్రకారం జరిమానా విధిస్తారు.

బెదిరింపులకు పాల్పడితే..

ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని అభ్యర్థులు, పార్టీల నేతలు ఓటర్లను బెదిరించకూడదు. అలా చేస్తే ఐపీసీ171(సీ) ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఏడాది జైలుశిక్షతోపాటు జరిమానాలు విధించవచ్చు. రెండూ కూడా విధించే అవకాశాలుంటాయి.

దొంగ ఓట్లు వేస్తే..

ఎన్నికల్లో ఒకరి ఓటు మరొకరు వేస్తుంటారు. ఇలాంటి వాటినే దొంగ ఓట్లు అంటారు. తర్వాత వచ్చిన అసలు ఓటరు తన ఓటు ఎవరో వేశారని తెలిసి అవాక్కవుతారు. ఇలా దొంగ ఓట్లు వేయించినా.. వేసిన చట్ట ప్రకారం నేరమే. ఐపీసీ171(ఎఫ్‌) ప్రకారం ఏడాది జైలుతోపాటు జరిమానా విధిస్తారు.

కానుకలు ఇవ్వడం

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటర్లను ఆకర్షించడానికి కానుకలు అందించినా నేరమే. మహిళలకు చీరలు, ఇంటి పరికరాలు, యువకులకు క్రీడా సామగ్రి, సెల్‌ఫోన్లు ఇలా ఏవి ఇచ్చినా ఐపీసీ (171)ఈ ప్రకారం ఏడాది జైలుశిక్షతోపాటు జరిమానా ఉంటుంది.

మద్యం పంపిణీ చేస్తే..

ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నేతలు మద్యం పంపిణీ చేస్తుంటారు. పోలీసులు, అధికారుల తనిఖీల్లో అనుమతి లేకుండా, పరిమితికి మించి మద్యం నిల్వ ఉంచుకున్నా.. విక్రయించినా, ఓటర్లకు పంపిణీ చేసినా కేసులు నమోదు చేస్తారు. ఓటర్లకు సారా, కల్లు, మద్యం, ఇతర మత్తు పదార్థాలు ఏవి ఇచ్చిన నేరమే. ఎకై ్సజ్‌ చట్టం– 1968 సెక్షన్‌ 34(ఎ) ప్రకారం ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలుశిక్ష పడుతుంది. రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా విధిస్తారు.

విద్వేషపూరిత ప్రసంగాలు..

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా విద్వేషపూరిత ప్రసంగాలు, వ్యాఖ్యలు చేసే వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం (ఆర్‌పీ యాక్ట్‌)– 125 నిబంధనల ప్రకారం మూడేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా ఉంటుంది. రెండు కూడా విధించవచ్చు. ఎవరూ మతాలు, వర్గాలను కించపరిచేలా, మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడొద్దు.

ఎన్నికల్లో భారతీయ శిక్షాస్మృతి,ప్రజాప్రాతినిధ్య చట్టం కింద చర్యలు

ప్రత్యేక చట్టాలతో కఠిన శిక్షల అమలు

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top