పరారీలో ‘ప్రవళిక’ కేసు నిందితుడు | Sakshi
Sakshi News home page

పరారీలో ‘ప్రవళిక’ కేసు నిందితుడు

Published Thu, Oct 19 2023 1:22 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రవళిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శివరాం రాథోడ్‌ స్వగ్రామం నారాయణపేట జిల్లా కోస్గి మండలం పీసీతండా ఒక్కసారిగా వార్తాల్లోకి రావడంతో గిరిజనులు ఉలిక్కి పడుతున్నారు. విచారణ నిమిత్తం కొత్త కొత్త వ్యక్తులు తండాకు వస్తుండటంతో భయంతో తండావాసులు ఉదయం వెళ్లి రాత్రికి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు.

నిందితుడి కుటుంబం ఆర్థికంగా బాగా ఉండి పలుకుబడి కలిగినది కావడంతో వివరాలు చెప్పడానికి జనాలు ముందుకు రావడం లేదు. నిందితుడు శివరాం తల్లిదండ్రులు కిషన్‌ రాథోడ్‌, సుశీల మహారాష్ట్రలోని ముంబయిలో కాంట్రాక్టర్‌లుగా అక్కడే స్థిరపడ్డారు. కిషన్‌ రాథోడ్‌కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు కాగా పెద్ద కుమారుడు శివరాం రాథోడ్‌ బీటెక్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కోచింగ్‌ సెంటర్‌లో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాడు.

రెండో కుమారుడు మణిరాం రాథోడ్‌ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతుండగా యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చాడు. కూతురు అనురాధ మహబూబ్‌నగర్‌లో బీటెక్‌ చదువుతుంది. పీసీతండాలో తాత హేమ్లానాయక్‌, నానమ్మ మోనెమ్మ, మాణిక్యమ్మల దగ్గరకు పిల్లలు అప్పుడప్పుడు వచ్చి పోతుండేవారు.

రాజకీయంగా దుమారం..
ప్రవళిక ఆత్మహత్య సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారడంతోపాటు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసులో నిందితుడిగా శివరాం రాథోడ్‌ను నిర్ధారించడంతో అతని కుటుంబం మొత్తం అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

నిందితుడి స్వగ్రామంలోని ఇంటికి సైతం తాళం వేసి కుటుంబ సభ్యులు ముఖం చాటేశారు. ఈ విషయమై తండావాసులు ఎవరూ నోరు మెదపకపోవడంతో నిశ్శబ్దం అలుముకుంది. ఏదేమైనా రాష్ట్రవ్యాప్త సంచలన కేసుకు కోస్గి మండలం మరోమారు వేదికై ంది.

ప్రవళికతో ప్రేమాయణం.. మరో యువతితో పెళ్లి ఏర్పాట్లు
ఆత్మహత్య చేసుకున్న ప్రవళికతో ప్రేమాయణం నడిపిన శివరాం రాథోడ్‌ వికారాబాద్‌ జిల్లా పరిగి సమీపంలోని ఓ తండాకు చెందిన యువతితో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించడంతో 15 రోజుల క్రితం పెళ్లిచూపుల తతంగాన్ని ఇరు కుటుంబాల వారు పూర్తి చేసుకున్నారు.

దసరా తర్వాత ముహూర్తాలు వస్తాయని, అప్పుడే ఎంగేజ్‌మెంట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. తాను ప్రేమించిన యువకుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Advertisement
 
Advertisement