ఆసియా లాక్రోస్ క్రీడలకు జిల్లా క్రీడాకారుడు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాలోని మూసాపేట మండలం వేములకి చెందిన అనుదీప్‌రెడ్డి లాక్రోస్ క్రీడల్లో విశేష ప్రతిభ చాటుతున్నాడు. ఈ క్రీడలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్నాడు. ఇప్పటికే అనుదీప్‌రెడ్డి నాలుగుసార్లు జాతీయస్థాయి లాక్రోస్ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. 2024 సెప్టెంబర్‌లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగిన లాక్రోస్ ఫెడరేషన్ కప్, ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్తాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లో జరిగిన సీనియర్ నేషనల్ లాక్రోస్ చాంపియన్‌షిప్‌లో, మేలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగిన నేషనల్ లాక్రోస్ చాంపియన్‌షిప్‌లో, డిసెంబర్‌లో జమ్ముకాశ్మీర్ రాష్ట్రం కాట్రాలో జరిగిన ఫెడరేషన్ కప్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ఆడాడు.
● రెండోసారి అంతర్జాతీయ లాక్రోస్ పోటీలకు అనుదీప్‌రెడ్డి ఎంపికయ్యాడు. గత ఏడాది ఫిబ్రవరి 20 నుంచి 23వ తేదీ వరకు జపాన్ దేశం ఒకినొవాలో జరిగిన లాక్రోస్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆదివారం నుంచి సౌదీ అరేబియా రియాద్‌లో జరగనున్న ఏషియన్ లాక్రోస్ గేమ్స్‌లో భారత జట్టుకు అనుదీప్‌రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
మహబూబ్‌నగర్ గెలుపు
మహబూబ్‌నగర్ క్రీడలు: సంగారెడ్డిలో శనివారం జరిగిన అండర్–16 ఇంటర్ డిస్ట్రిక్ట్ వన్డే టోర్నమెంట్‌లో మహబూబ్‌నగర్ జట్టు 12 పరుగుల తేడాతో మెదక్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 49.4 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో బీరేంద్ర 125 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 84 పరుగులు, కేతన్‌కుమార్ 98 బంతుల్లో 7 ఫోర్లతో 73 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన మెదక్ జట్టు 45.4 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో రహెమత్ 81, హర్ష్‌దీప్ 60 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ బౌలర్లు అభినవ్ 4, వంశీగౌడ్ 2 వికెట్లు తీశారు. జిల్లా జట్టు విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
సమోసాలో పంచ్ పిన్నులు
బిజినేపల్లి: మండల కేంద్రంలోని ఒక స్వీటు దుకాణంలో సమోసా తింటున్న వ్యక్తికి అందులో పంచ్ పిన్ను కన్పించింది. ఈ ఘటన గురువారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా శనివారం వెలుగు చూసింది. ఉమ్యాజీ స్వీట్‌హౌస్‌లో ఒక వ్యక్తి సమోసా కొని తింటుండగా అందులో పంచ్ పిన్ను కన్పించింది. ఇదేమిటని ప్రశ్నించిన సదరు యాజమాని విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మండల కేంద్రంలోని 2025 జూలైలో శ్రీలక్ష్మి బెంగళూర్ అయ్యాంగార్ బేకరిలో కూడా బ్రెడ్‌కి బూజు పట్టడం స్థానికంగా కలకలం రేగింది. వినియోగదారు అప్పటి ఆహార భద్రత అధికారి నీలిమకు ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా తనిఖీలు చేసి వెళ్లింది. సదరు వినియోగదారు తన ఫిర్యాదు ఏమైందని ఆ అధికారి నీలిమకు వందల సంఖ్యలో ఫోన్లు, మెసెజ్‌లు చేసినా స్పందించలేదు. అధికారి స్పందించడం లేదని కలెక్టర్ స్థాయిలో అధికారులకు సమస్యను వివరించినా.. ఆ అధికారి వారికి కూడా స్పందించలేదు. ఈ సమస్యల విషయమై ప్రస్తుత అధికారి శ్రీలత వివరణ కోరగా.. ఈ రెండు విషయాలు ఇప్పుడే తన దృష్టికి వచ్చాయని, త్వరలోనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
భారత జట్టుకు కెప్టెన్‌గా అనుదీప్‌రెడ్డి
ఆసియా లాక్రోస్ క్రీడలకు జిల్లా క్రీడాకారుడు
ఆసియా లాక్రోస్ క్రీడలకు జిల్లా క్రీడాకారుడు


