పక్కా నిఘా..
● మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు
అధికారుల నియామకం
● జిల్లా ఎన్నికల అథారిటీగా కలెక్టర్
● ఎన్నికల కోడ్ అమలుకు నిఘా బృందాలు
వ్యయ పరిశీలకులు
మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే వ్యయ పరిశీలనకు ఒక్కో మున్సిపాలిటీకి సహాయ వ్యయ పరిశీలకులను నియమిస్తారు. పెద్ద మున్సిపాలిటీలకు ఇద్దరు చొప్పున నియమించే అవకాశం ఉంది. మండల గణాంకాల అధికారులు అభ్యర్థులు చేసే వ్యయాన్ని లెక్కిస్తారు. అభ్యర్థులు సమర్పించిన లెక్కలు, వీడియో బృందాలు సమర్పించిన లెక్కలను పరిశీలిస్తారు. ఆడిట్ అధికారులను జిల్లాకు ఒక వ్యయ పరిశీలకుడిని నియమించారు.
అచ్చంపేట: మున్సిపల్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు విధులు, బాధ్యతలు అప్పగించింది. ఇందుకు సంబంధించిన హ్యాండ్‌బుక్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాలకు పరిశీలకుల నియామకం పూర్తి చేసింది. ఆయా జిల్లాలో ఎన్నికల పర్యవేక్షణ, కార్యకలాపాల నిర్వహణ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు అధికారుల నియామకం పూర్తి చేసింది. సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు నిఘా బృందాలను పటిష్టం చేశారు. ఎన్నికల సాధారణ పరిశీలకులుగా ప్రతి జిల్లాకు ఇతర ఐఏఎస్ స్థాయి అఽధికారులను నియమించారు. కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, వారి విధులు తెలుసుకుందాం.
జిల్లా ఎన్నికల అధికారి
జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ జిల్లాలో జరిగే ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. సజావుగా ఎన్నికలు జరిపించడంలో కలెక్టరే కీలకం. సాధారణ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ చేపడుతారు. మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. నోడల్ అధికారులు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు కమిటీల నియామకం, ఆర్వోలు, ఏఆర్వోలు, సిబ్బంది నియామకం వీరి ఆధ్వర్యంలో జరుగుతాయి. సహాయ ఎన్నికల అధికారులైన కమిషనర్ పంపిన ప్రతిపాదనలు పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తారు.
అదనపు జిల్లా ఎన్నికల అధికారి
అదనపు కలెక్టర్ అదనపు జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తారు.
డిప్యూటీ ఎన్నికల అధికారి
జిల్లా ఉప ఎన్నికల అధికారిగా ఆర్డీఓలు ఉంటారు. తిరస్కరించిన నామినేషన్ పత్రాలపై అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు డిప్యూటీ ఎన్నికల అధికారికి అప్పీలు చేసుకుంటే విచారించి పరిష్కరిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్‌ను తిరస్కరించడం లేదా ఆమోదించే అధికారం వీరికి ఉంటుంది.
ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
విభాగాల వారీగా జిల్లాస్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తారు. వీరు సిబ్బంది శిక్షణ, సౌకర్యాల కల్పన, మానవ వనరుల సమీకరణ, ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లుకు విభాగాల వారీగా అధికారులను నియమిస్తారు. ఎన్నికల్లో లోటుపాట్లు జరుగకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వీరికి అప్పగించారు. కలెక్టర్ పర్యవేక్షణలో వీరు పనిచేస్తారు.
సహాయ ఎన్నికల అధికారులు
ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు సహాయ ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారు. తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. ఓటర్ల జాబితా తయారీ, వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారీగా ఓటర్ల జాబితా తయారీతోపాటు ముసాయిదా, తుది జాబితాను విడుదల చేస్తారు. అభ్యంతరాలు స్వీరించి పరిష్కరిస్తారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక, సౌకర్యాల కల్పన చూడాల్సింది కూడా వీరే. సిబ్బంది శిక్షణ, సామగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూం ఏర్పాట్లు చూడాలి. నామినేషన్ల స్వీకరణకు కేంద్రాల ఎంపిక చేయాలి.
ఆర్వోలు..
రిటర్నింగ్ అధికారులు(ఆర్వో)ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నియమిస్తారు. మూడు వార్డులకు ఒక ఆర్వో ఉంటారు. మూడు వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు వీరిదే పూర్తి బాధ్యత. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, తిరస్కరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు చేపట్టి వీరే ఫలితాలు ప్రకటిస్తారు.
ఏఆర్వోలు.. రిటర్నింగ్ అధికారికి వీరు సహాయంగా ఉంటారు. వీరు కాకుండా రూట్ అధికారులు, జోనల్ అధికారులు ఉంటారు. వీరంతా పోలింగ్ నిర్వహణ, సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలింపు, తిరిగి వారిని రిసెప్షన్ కేంద్రాలకు చేర్చి స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచే వరకు వీరిదే బాధ్యత.
స్టాటిక్ సర్వేలైన్స్ బృందం: మున్సిపల్ సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనఖీ చేపడుతారు. ఇందులో ఆర్‌ఐ, ఆ పైస్థాయి అధికారి, పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు. డబ్బులు, మద్యం అక్రమ రవాణాపై దృష్టి పెడతారు. ఒక్కో మున్సిపాలిటీకి స్టాటిక్ సర్వేలైన్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద మున్సిపాలిటీలో రెండు ఉంటాయి. అందులో డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారి, పోలీస్ అధికారిని నియమిస్తారు. వీడియోగ్రాఫర్‌ను ఆయా మున్సిపల్ కమిషనర్ల స్థానికంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఫ్లయింగ్ స్క్వాడ్ : డబ్బు, మద్యం పంపిణీ, ప్రవర్తన నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేస్తాయి. పట్టుబడితే సహాయ ఎన్నికల అధికారికి నివేదించి, కేసు నమోదు చేస్తారు. వీరి వెంట వీడియోగ్రాఫర్ ఉంటారు. మున్సిపాలిటీ విస్తీర్ణం మేరకు ఏర్పాటు చేస్తారు.
వీడియో సర్వేలైన్స్ బృందం : ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు, అభ్యర్థుల ప్రచారాన్ని వీడియోలో చిత్రీకరిస్తారు. ప్రవర్తన నియామవళి ఉల్లంఘన, వాహనాలు, పొల్గొన్న ప్రజలు, నాయకులు, అభ్యర్థుల ప్రసంగాలు, అక్రమాలను చిత్రీకరిస్తారు.
వీడియో వ్యూయింగ్ బృందం
వీడియో సర్వేలైన్స్ బృందాలు తీసిన వీడియోను వ్యూయింగ్ బృందం పరిశీలిస్తుంది. సభలు, ర్యాలీలు, ప్రచారాల్లో ఎంత మంది పాల్గొన్నారు. జెండాలు, వాహనాల వినియోగం, ఖర్చు లెక్కించి వ్యయ పరిశీలకుడికి అందజేస్తారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ప్రచారాల్లో అభ్యర్థులు చేసే ఖర్చుల పరిశీలన, లెక్కింపు కోసం జిల్లా ఎన్నికల అధికారులు కమిటీలు వేస్తారు. అధికారులకు వచ్చే ఫిర్యాదుల మేరకు తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఒక్కో మున్సిపాలిటీలో విడివిడిగా ఏర్పాటు చేస్తారు. బృందాల్లో ఒక అధికారి, ఒక పోలీస్ అధికారితో పాటు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు. వీటిని వీడియోల్లో చిత్రీకరిస్తారు. ఆయా బృందాలకు ఒక వీడియోగ్రాఫర్‌ను స్థానిక సహాయ ఎన్నికల అధికారులు నియమించాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రకటన జారీ నాటి నుంచి ఈ బృందాలు కార్యాచరణ చేపడుతాయి.
పక్కా నిఘా..
పక్కా నిఘా..


