నడిగడ్డ ఇలవేల్పు.. జములమ్మ | - | Sakshi
Sakshi News home page

నడిగడ్డ ఇలవేల్పు.. జములమ్మ

Feb 1 2026 3:41 AM | Updated on Feb 1 2026 3:41 AM

నడిగడ

నడిగడ్డ ఇలవేల్పు.. జములమ్మ

నేడు అమ్మవారి సన్నిధిలో పౌర్ణమి వేడుకలు

శోభాయమానంగా ఆలయ సముదాయం ముస్తాబు

50వేల మంది భక్తులు దర్శించుకునే అవకాశం

అన్నిరకాల ఏర్పాట్లు

పూర్తి చేసిన అధికారులు

గద్వాలన్యూటౌన్‌: నడిగడ్డ ప్రజల ఇలవేల్పు.. భక్తుల కొంగుబంగారం.. శ్రీజములమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కీలకగట్టమైన పౌర్ణమి వేడుకలు ఆదివారం జరగనున్నాయి. దాదాపు 50 వేల మంది వేడుకలకు హాజరై అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అధికారుల అంచనా. పౌర్ణమి వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

పౌర్ణమి వేడుకలు

జములమ్మ సన్నిధిలో పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. తెల్లవారుజామున 4గంటలకు 108 కళశాలతో అమ్మవారికి అభిషేకం జరిపిస్తారు. 5గంటలకు విశేష పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి అలంకరణ, తదనంతరం అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. పౌర్ణమి వేడుకలకు ఉమ్మడి జిల్లా నుంచేకాక ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 50వేల మంది దాక భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకోనున్నారు.

పోలీస్‌ బందోబస్తు

పౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ శ్రీను పర్యవేక్షణలో నలుగురు ఎస్‌ఐలు, 55మంది ఏఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌, హోంగార్డులు బందోబస్తు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతంలో మూడు ఔట్‌పోస్టులు ఏర్పాటు చేశారు. దొంగతనాలు జరగకుండా ఆలయ సముదాయం నుంచి మొయిన్‌రోడ్డు వద్ద ఉన్న ఆర్చి వరకు పలుచోట్ల సీసీ కెమారాలు ఏర్పాటు చేశారు.

ఇల్కల్‌ టు జమ్మిచేడు

నడిగడ్డలో ప్రసిద్ధిగాంచిన జములమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించే పౌర్ణమి వేడుకలకు కర్ణాటక రాష్ట్రం ఇల్కల్‌ నుంచి జములమ్మ పాదయాత్ర మండలి సభ్యులు ఏటా 250కి.మీ. పాదయాత్రగా జములమ్మ ఆలయానికి వస్తారు. 12ఏళ్ల నుంచి ఈ తంతు సాగుతోంది. 13వసారి కూడా ఇల్కల్‌ నుంచి 120మంది భక్తులు ఏడురోజులు పాదయాత్రతో శనివారం ఉదయం 11గంటలకు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. భక్తులకు ఈఓ పురందర్‌కుమార్‌, సిబ్బంది స్వాగతం పలికారు. వసతి కల్పించి పండ్లు అందించారు.

విద్యుద్దీపాల వెలుగులో జములమ్మ అమ్మవారి ఆలయం

ఏర్పాట్లు పూర్తి చేశాం

పౌర్ణమి వేడుకలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. తాగునీరు, అందుబాటులో వైద్యసేవలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. క్యూలైన్‌ల వద్ద తోపులాట జరగకుండా చర్యలు తీసుకుంటాం. భక్తులు దేవాదాయశాఖ సిబ్బందికి సహకరించాలి.

– పురందర్‌ కుమార్‌, ఆలయ ఈఓ

నడిగడ్డ ఇలవేల్పు.. జములమ్మ 1
1/2

నడిగడ్డ ఇలవేల్పు.. జములమ్మ

నడిగడ్డ ఇలవేల్పు.. జములమ్మ 2
2/2

నడిగడ్డ ఇలవేల్పు.. జములమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement