మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో పందులు, కోతులు, కుక్కల స్వైరవిహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీ స్థలాల్లో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు పందులకు ఆవాసాలుగా మారుతున్నాయి. అధికారులు పందుల పెంపకందారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్ప వారిపై చర్యలు తీసుకోవడంతో లేదు. దీంతో పందుల సంఖ్య పెరిగి ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
141 మంది కార్మికులు మాత్రమే..
మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు ఉన్నారు. విద్యా, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం మానుకోటలో నివాసం ఉండే వారితో కల్పితే లక్ష జనాభా దాటుతుంది. మున్సిపాలిటీలో 143 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండగా.. ఇటీవల ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 141 మంది మాత్రమే ఉన్నారు. కార్మికుల కొరతతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కాల్వలు శుభ్రం చేసే మిషన్, రోడ్డు స్వీపింగ్ మిషన్ పని చేయడం లేదు. 14 మూడు చక్రాల ఆటోలు, 19 నాలుగు చక్రాల ఆటోలు, 11 ట్రాక్టర్లు ఉండగా వాటిలో పలు వాహనాలు తరచూ మరమ్మతుల బారిన పడుతున్నాయి. ప్రతీరోజు 33 టన్నుల చెత్త సేకరణ చేస్తున్నారు. వాహనాలు మరమ్మతులు, కార్మికుల కొరతతో పారిశుద్ధ్య సమస్య వెంటాడుతోంది.
వెంటాడుతున్న పందుల సమస్య..
మున్సిపాలిటీ పరిధిలో రోజురోజుకూ పందుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఖాళీ స్థలంలో విపరీతంగా ఉన్నాయి.
● కురవి రోడ్డులోని బంధం చెరువు సమీపంలో సిద్ధార్థ ఆస్పత్రి ఎదుట ఖాళీ స్థలంలో వందల సంఖ్యలో పందులు ఆవాసం ఉంటున్నాయి. లక్ష్మి టాకీస్, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం సమీపం, సాయిబాబా గుడి రోడ్డు, రెడ్డి బజార్, కంకరబోడ్, కురవి రోడ్డులోని రఘు హోటల్ సమీపంలో వందల సంఖ్యలో ఉన్నాయి.
● 10వ వార్డు పరిధిలోని ముత్యాలమ్మ తండా శివారులో పెద్ద సంఖ్యలో పందులు ఉన్నాయి. అవి పంటలను నాశనం చేస్తున్నాయి.
ఖాళీ స్థలాలే ప్రధాన కారణం..
మున్సిపాలిటీ పరిధిలో ఇళ్లమధ్య సుమారు 250కిపైగా ఖాళీ స్థలాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. వాటిలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి పందులకు నిలయంగా మారాయి. ఆ స్థలాల యజమానులకు ముందుగా నోటీస్‌లు ఇచ్చారు. స్పందన లేదు. హోటళ్లు, ఫంక్షన్ హాల్స్ కూడా నిబంధనలు పాటించడం లేదు. పక్కనే చెత్తాచెదారం, మిగిలిన ఆహార పదార్థాలు వేయడంతో పందుల సంఖ్య పెరుగుతోంది. కాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం, రోడ్లపై చెత్తాచెదారం వేడయం వల్ల కూడా పందుల సంచారం పెరిగింది.
సమావేశాలకే పరిమితం..
మున్సిపల్ కమిషనర్ వినోద్‌కుమార్ బాధ్యతలు స్వీకరించి ఐదు నెలలు అవుతోంది. ఈ సమయంలో ఆయన 10సార్లు పందుల పెంపకందారులతో సమావేశాలు నిర్వహించారు. పందులను పట్టణానికి దూరంగా పెంచుకోవాలని చెప్పినా.. పెంపకందారులు స్పందించలేదు. పందుల కోసం రెవెన్యూ శాఖ గుమ్ముడూర్ శివారులో రెండు ఎకరాల స్థలం కేటాయించింది. అయినా వారు స్పందించడం లేదు.
ప్రజల ఆరోగ్యం బేజార్..
పందుల సంఖ్య పెరిగి పరిసరాలు అపరిశుభ్రంగా మారి దోమల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో దోమకాటుతో ప్రజలు ఆస్పత్రులు పాలవుతున్నారు. దీంతో వేలాది రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లపై, కాల్వల్లో పేరుకుపోయిన
చెత్తాచెదారం
సమావేశాలకే పరిమితమైన పందుల పట్టివేత
నోటీసులు ఇచ్చినా స్పందించని ఖాళీ స్థలాల యజమానులు
నిబంధనలు పాటించని ఫంక్షన్ హాల్స్


