నీటిని ఒడిసిపట్టేలా..! | - | Sakshi
Sakshi News home page

నీటిని ఒడిసిపట్టేలా..!

Nov 2 2026 1:17 AM | Updated on Nov 2 2026 1:17 AM

● వీబీజీ రామ్‌జీ పథకంలో

జల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ

● ఇంకుడుగుంతలు, ఫారంపాండ్ల

నిర్మాణాలు

● ఎండిన బోరుబావులకు ప్రాణం పోసేలా అడుగులు

మహబూబాబాద్‌ అర్బన్‌/డోర్నకల్‌: వీబీ జీరాంజీ పథకంలో కూలీలకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామాల శాశ్వత అభివృద్ధిని కాంక్షిస్తూ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్‌లో నీటి ఎద్దడిని తగ్గించేలా ఇంకుడుగుంతలు, ఫారంపాండ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామాల్లో అన్ని పనులకు ఈ పథకాన్ని వినియోగించుకుంటే చాలా సమస్యలను అధిగమించవచ్చని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీబీ జీరాంజీ ఎఫ్‌ఏలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పథకం గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు.

జిల్లాలో జాబ్‌ కార్డుల వివరాలు..

జాబ్‌ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి ఏడాదిలో గరిష్టంగా 125రోజుల ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. జిల్లాలో 18 మండలాల్లో మొత్తం జాబ్‌ కార్డులు 2.03 లక్షలు ఉన్నాయి. వీటిలో 4.05లక్షల మంది కూలీలు ఉన్నారు. కాగా, 1.32లక్షల జాబ్‌కార్డులు యాక్టివ్‌లో ఉండగా.. 2.35లక్షల మంది ఉపాధి పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారు.

జల సంరక్షణకు ప్రాధాన్యం..

ఎల్‌నినో ప్రభావంతో కరువును ఎదుర్కొనేందుకు, బొట్టుబొట్టును ఒడిసిపట్టేలా జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. భూగర్భజలాల వృద్ధికి ఫారంపాండ్ల నిర్మాణం, ఇళ్లలో ఇంకుడుగుంతలు, బోరుబావుల వద్ద రీచార్జ్‌ పిట్స్‌, వీధులు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాల ఆవరణల్లో సోక్స్‌పీట్స్‌ నిర్మించడానికి మార్గదర్శకాలు రూపొందించారు.

నిధులు ఇలా..

● రైతుల పొలాల్లో ఫారంపాండ్ల నిర్మాణానికి కొలతల ప్రకారం రూ.60 వేల నుంచి రూ.4.60 లక్షల వరకు చెల్లించనున్నారు. పండ్ల మొక్కల పెంపకానికి ఎకరానికి రూ.1.10 లక్షల నుంచి రూ.1.20 లక్షలు ఇవ్వనున్నారు.

● బోరుబావి ఎండిపోకుండా రీచార్జ్‌ పీట్‌కు రూ.30 వేలు, సోక్‌పీట్స్‌ నిర్మాణానికి రూ.13 వేలు, ఇళ్లలో నిర్మించుకునే ఇంకుడుగుంతకు రూ.7,00 చొప్పున అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.

భూగర్భజలాల పెంపు లక్ష్యం

కలెక్టర్‌ ఆదేశాల మేరకు పనులు మంజూరు చేశాం. వీబీ జీరామ్‌ జీ పథకంలో జల సంరక్షణకే ప్రాధాన్యత ఇస్తుండడంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శాశ్వత నిర్మాణాలపై జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. గ్రామపంచాయతీలో పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నాం.

–జి.మధుసూదన్‌ రాజ్‌, డీఆర్‌డీఓ

ఐదు సంవత్సరాల క్రితమే నిర్మించా..

ఐదు సంవత్సరాల క్రితమే మా ఇంట్లో ఇంకుడుగుంత నిర్మించాను. మా ఊర్లో ఐదేళ్ల క్రితమే ఇంకుడుగుంతల నిర్మాణం ఉద్యమంలా సాగింది. ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత నిర్మాణంతో మా ఇంటి నుంచి వృథా నీరు ఒక్క చుక్క కూడా బయటకు రాదు.

–గుగులోత్‌ చందా, చాప్లాతండా, డోర్నకల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement