వెంకటాపురం (ఎం): మండల పరిధిలోని రామప్ప దేవాలయంలో సండే సందడి నెలకొంది. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన 30మంది సీనియర్ సిటిజన్స్ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారికి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం, కాకతీయుల చరిత్ర గురించి వివరించారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేసి సందడిగా గడిపారు. వారి వెంట ఈఓ ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, భద్రు, శ్రీకాంత్, పురావస్తు, దేవాదాయశాఖ, టూరిజం శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
వన దేవతలకు మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధికసంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి మేడారం చేరుకున్న భ క్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం తల్లుల గద్దెల వద్ద పసు పు, కుంకుమ, చీరసారె, గాజులు, పూలు, పండ్లు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. భక్తులు అనంతరం మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని భోజనాలు చేశారు.
హేమాచలంలో భక్తుల రద్దీ
మంగపేట : మండల పరిధిలోని మల్లూరులోని హేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు అనిపెద్ది రాజీవ్‌శర్మ, కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, వెంకటనారాయణ శర్మ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన తిల తైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు.


