కురవి: మండల కేంద్రంలోని భధ్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు.
బియ్యం అధిక ధరలకు
విక్రయిస్తే చర్యలు
● అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్
మహబూబాబాద్: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రభుత్వం ధరలు నిర్ణయించిందని, ఆ ధరలను విస్మరించి అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం బీపీటీ కిలో బియ్యం ధర రూ.66, సోనా బియ్యం రూ.74, శ్రీరామగోల్డ్ కిలో ధర రూ.79గా నిర్ణయించిందన్నారు. విక్రయ కేంద్రాల వద్ద బ్యానర్‌పై ధరలు పట్టికలు వెల్లడించాలని ఆదేశించారు.
జిల్లాస్థాయి రోల్‌ప్లే పోటీలు
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులో సామాజిక అవగాహన, ఆరోగ్యకరమైన జీవనశైలి, మానసిక ఆరోగ్యం, బాధ్యతాయుత పౌరసత్వ విలువలను పెంపొందించాడానికి ఈ నెల 3న జిల్లాస్థాయి రోల్ ప్లే పోటీలు నిర్వహిస్తున్నామని డీఈఓ కె.అనిల్‌కుమార్ ఆదివారం తెలిపారు. రోల్ ప్లే పోటీల్లో తెలంగాణ గురుకుల పాఠశాల, మోడల్ స్కూల్, కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు పాల్గొనాలన్నారు. ప్రతీ పాఠశాల నుంచి నలుగురు మాత్రమే పాల్గొనాలని, విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ యూనిఫాంతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి అప్పారావు 9849598281 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
ప్రశాంతంగా
ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
మహబూబాబాద్ అర్బన్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎంఎస్)పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అనిల్ కుమార్ ఆదివారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాలో 481 మంది విద్యార్థులకు 463 మంది హాజరయ్యారని, తొర్రూరు పట్టణంలో రెండు పరీక్ష కేంద్రాల్లో 323 మంది విద్యార్థులకు గాను 303 మంది హాజరైనట్లు వెల్లడించారు. మొత్తం 804 మంది విద్యార్థులకు గానూ 766 మంది హాజరుకాగా 38 మంది గైర్హాజరయ్యారని, 95.27 శాతం హాజరు నమోదైనట్లు చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బుచ్చయ్య, ఏసీజీఈ మందుల శ్రీరాములు, కోఆర్డినేటర్ శేషుకుమార్ పరీక్షలను పర్యవేక్షించారు.
ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణంలోని వేణుగోపాలస్వామి దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంతాల్లో వాహనాలను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు వాహనదారులు తమ వాహనాలను ప్రధాన రోడ్డు మధ్యలో నిలిపివేసి రోజులు తరబడి అక్కడే ఉంచి వెళ్తున్నారని, దీంతో నిత్యం ట్రాఫిక్ కష్టాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసు అధికారులు స్పందించి వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
కోటగుళ్లలో సందడి
గణపురం: వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్‌లో భాగంగా ఆదివారం గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లను పరిశోధక బృందం సభ్యులు సందర్శించారు. ప్రొఫెసర్ పాండురంగారావు ఆధ్వర్యంలో సందర్శించి కోటగుళ్ల చరిత్రను తెలుసుకున్నారు. బృందం సభ్యులు ఆలయ శిల్ప సంపదను తిలకించారు. ఆలయ నిర్మాణ విధానం, ప్రాముఖ్యత తదితర అంశాలను పాంగురంగారావు వారికి వివరించారు.


