మహబూబాబాద్: ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పెద్దగా కొనసాగడంలేదు. ప్లాట్లు అమ్మే వారు ఎక్కువగా ఉండగా కొనేవారు తక్కువ అన్నట్లుగా పరిస్థితి. మారింది. కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రస్తుత మార్కెట్‌కు తగ్గట్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్న భూములతోపాటు, వివాదా స్పద భూములతో తమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. గజం రూ.4,500 నుంచి రూ.7,000 మధ్య ఉండడంతో తక్కువకు భూమి వస్తుందనే ఆశతో సామాన్యులు సైతం ఆసక్తి చూపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యాపారం జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పెరిగిన మున్సిపల్ విస్తీర్ణం..
కొన్నేళ్ల క్రితం మానుకోట మున్సిపాలిటీలో పలు గ్రామాలను విలీనం చేయగా విస్తీర్ణం పెరిగింది. దాంతో విలీన గ్రామాల భూముల ధరలు కూడా పెరిగాయి. మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు ఉన్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపార పరంగా మానుకోటలో నివాసం ఉండే వారితో కల్పితే జనభా సుమారు లక్ష దాటుతుంది. మానుకోటలోని ప్రభుత్వ భూమి చాలాచోట్ల కబ్జాకు గురైంది. ఈక్రమంలో గతంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిన సమయంలో కొనుగోలు చేసినవారు కనీసం అదే ధరకు విక్రయించాలని చూస్తున్నారు. కొంత అప్పు చేసి కొన్నవారు మాత్రం వడ్డీతో ఇబ్బందులు పడలేక తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.
పేదల బలహీనతే ఆసరాగా..
కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వివాదాస్పద భూములు, అసైన్డ్ భూములు కోనుగోలు చేసి వెంచర్ల మాదిరిగా చేసి విక్రమాలు చేస్తున్నారు. కనీసం నాలా అనుమతి కూడా లేకుండానే విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కాలనీలలో గజం కనీసం రూ.20,000 నుంచి రూ.25,000 ఉంది. శివారులో కూడా రూ. 15,000పైనే ఉంది. అది గమనించిన కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుమతులు లేకుండా వివాదాస్పద భూములలో ప్లాట్లు చేసి గజం రూ.4,500 నుంచి రూ.7,000 పెట్టి విక్రయాలు చేస్తున్నారు. తక్కువ ధర కావడంతో ఏమాత్రం ఆలోచించకుండానే ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు.
నిబంధనలు పాటించాలి..
రియల్ ఎసే్‌ట్‌ట్ వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. పట్టా భూమిని తీసుకోవాలి. నాలా (నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్) అనుమతి రెవెన్యూ నుంచి తీసుకోవాలి. తర్వాత అనుమతికోసం సంబంధిత పత్రాలతో మున్సిపాలిటీ కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్ విభాగంతో దరఖాస్తు చేసుకోవాలి. పది ఎకరాలలోపు మాత్రమే మానుకోట మున్సిపాలిటీలో.. అంతకు మించితే హైదరాబాద్ టౌన్ ప్లానింగ్‌లో దరఖాస్తు చేయాలి. అనుమతి వచ్చిన తర్వాత 30 ఫీట్ల రోడ్డు, డ్రెయినేజీ తాగు నీటి ట్యాంక్, వీధిదీపాలు, ఇతరత్రా నిర్మాణాలు చేయాలి. 10 శాతం గ్రీన్ ల్యాండ్, 15 శాతం మున్సిపాలిటీ పేరున మార్టిగేజ్ చేయాలి. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే టీపీఓ ఆ స్థలాన్ని పరిశీలించి తన లాగిన్‌లో ఆమోదించాలి. ఆ తర్వాత కమిటీ (మున్సిపాలిటీ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పీఆర్ అధికారులు) కూడా పరిశీలించి ఆమోదిస్తే నెల రోజుల్లో అనుమతి వస్తుంది.
పట్టించుకోని అధికారులు
అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తున్నా, ప్లాట్లు విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులు కాసులకు కక్కుర్తి పడి వదిలేశారా.. ఏదైనా కారణం ఉందా.. అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అనుమతి లేని వెంచర్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
అనుమతి లేని వెంచర్లు..
జిల్లాలోని ఈదులపూసపల్లి రోడ్డులోని ఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఏఎల్ నగర్ కాలనీ సమీపంలో సుమారు రెండు ఎకరాల్లో వెంచర్ చేశారు. దానికి లేఅవుట్ అనుమతి లేదు. ఇతరత్రా అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. గజం రూ.6,000 చొప్పున విక్రయిస్తున్నారు.
మున్సిపాలిటీ పరిధిలో ఈదులపూసపల్లి గ్రామ శివారులోని ఎస్సీ కాలనీ సమీపంలో కూడా ఎలాంటి అనుమతి లేకుండానే ప్లాట్లు చేశారు. ఇక్కడ గజం రూ.4500 విక్రయిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ల విక్రయాలు
అక్రమార్జనలో రియల్టర్లు
నష్టపోతున్న కొనుగోలుదారులు
నాలా అమనుతి లేకుండానే
ప్లాట్ల అమ్మకం
చోద్యం చూస్తున్న సంబంధిత
అధికారులు
అనుమతులు లేని ప్లాట్లు కొనొద్దు
ఎలాంటి అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేయొద్దు. కొనేటప్పుడు అధికారులను సంప్రదించి అన్ని సవ్యంగా ఉన్నాయా.. లేదా.. చూసుకోవాలి. ప్రధానం మానుకోటలో వివాదాస్పద భూములు ఎక్కువగా ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసి నష్టపోవద్దు.
– సాయిరాం టీపీఓ,
మానుకోట మున్సిపాలిటీ


