పెరుగుతున్న ధరలు | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న ధరలు

Oct 26 2026 2:16 AM | Updated on Oct 26 2026 2:16 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఎక్కువగా పేద, మధ్యతరగతి కుటుంబాలపైనే పడుతుంది. ధాన్యం ధరలకు రెక్కలు రావడంతో సన్నబియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలకు బియ్యం ధరలు మరింత భారంగా మారాయి. ధాన్యం ధరలు పెరుగుతున్న కారణంగా ప్రజల ప్రధాన ఆహారమైన బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరోవైపు సన్న వడ్లకు వ్యవసాయ మార్కెట్‌ క్రయవిక్రయాల్లో క్వింటా ధర గరిష్టంగా రూ.5 వేలకుపైగానే ధర పలుకుతుంది. వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడులు తగ్గుతాయనే అంచనాలు బియ్యం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

కిలో బియ్యం రూ.90 దాటేనా..?

బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. సూపర్‌ ఫైన్‌ రకం బియ్యం కిలో రూ.90కు చేరువలో ఉండగా, కొన్ని రకాల ధరలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. సూపర్‌ ఫైన్‌ మీడియం రకం కిలో రూ.85 నుంచి రూ.90 వరకు పలుకుతుండగా, ఫైన్‌ రకం బియ్యం రూ.78 నుంచి రూ.80 మధ్య విక్రయిస్తున్నారు. నాణ్యత, బ్రాండ్‌, పాలిషింగ్‌, ప్యాకింగ్‌ బట్టి ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. దీంతో నెలవారీ సరుకుల కొనుగోలులో బియ్యానికే అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.

దిగుబడులపై వాతావరణ ప్రభావం..

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరి సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడులు తగ్గుతాయనే అంచనాలు మార్కెట్లో బియ్యం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. సరఫరా తగ్గుతుందనే ప్రచారం కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు ధరలను పెంచుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ధరల పెరుగుదలకు వాతావరణ పరిస్థితులే ఏకై క కారణమని నిర్ధారించలేం. ఉత్పత్తి, నిల్వలు, సరఫరా, మార్కెట్‌ డిమాండ్‌ అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.

హోటళ్లు, మెస్‌లపైనా ప్రభావం..

జిల్లాలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బియ్యం ధరల పెరుగుదల కుటుంబాల నెలవారీ ఖర్చులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, హాస్టళ్లు, చిన్న హోటళ్లు, మెస్సులకు బియ్యం కొనుగోలు ఖర్చులు పెరగడం ఆర్థిక భారంగా మారుతుంది. ఈ అదనపు వ్యయాన్ని భర్తీ చేసుకునేందుకు హోటళ్లు, మెస్‌ల నిర్వాహకులు భోజనం ధరలు పెంచే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో బియ్యం ధరల ప్రభావం నేరుగా వినియోగదారులపైనే పడుతుందని చెప్పవచ్చు.

ధరలకు కళ్లెం వేయాలి..

బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మార్కె ట్లో నిల్వలు, సరఫరా పరిస్థితులపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలపై తనిఖీలు చేపట్టాలని, బహిరంగ మార్కెట్లో ధరలను పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా బియ్యం సరఫరాను మెరుగుపరచడంతోపాటు ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సన్న వడ్లు క్వింటా రూ.5 వేలకుపైనే..

రూ.9 వేలకు చేరువలో క్వింటా బియ్యం

పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం

ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు

మూడు నెలల్లో భారీగా పెరుగుదల..

సన్నబియ్యం ధరలు జూలై నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. జూన్‌లో క్వింటా సన్నబియ్యం ధర రూ.5,600 నుంచి రూ.6,300 మధ్య ఉండగా, ఆగస్టు నాటికి రూ.6,300కు చేరింది. అక్టోబర్‌ మాసం వచ్చే సరికి నాణ్యత, బ్రాండ్‌ను బట్టి క్వింటా రూ.8,400 నుంచి రూ.9,200 వరకు పలుకుతుంది. అంటే మూడు నెలల వ్యవధిలోనే క్వింటాపై దాదాపు రూ.3 వేల వరకు పెరుగుదల నమోదైంది. హెచ్‌ఎంటీ, బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్‌ బియ్యం రకాల ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. గతంలో క్వింటా రూ.4,600 నుంచి రూ.5,500 మధ్య ఉన్న కొన్ని రకాల ధరలు ప్రస్తుతం రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు పలుకుతున్నాయి. ప్రీమియం రకాల ధరలు రూ.9 వేల మార్కును కూడా దాటుతున్నాయి. ఈ పరిణామాలు బియ్యం కొనుగోలుదారులపై అదనపు భారాన్ని మోపుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement