రేపు ఎంపీ వేం నరేందర్‌రెడ్డి రాక | - | Sakshi
Sakshi News home page

రేపు ఎంపీ వేం నరేందర్‌రెడ్డి రాక

Oct 26 2026 2:16 AM | Updated on Oct 26 2026 2:16 AM

కేసముద్రం: రేపు(మంగళవారం) రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి కేసముద్రం రానున్నారు. మున్సిపాలిటీ కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌, మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో రూ.3.5 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు, సంబంధిత అధికారులు ఆదివారం ప్రకటనలో తెలిపారు. అదే విధంగా డిసెంబర్‌ 9న ప్రారంభం కానున్న సీఎం బ్రేక్‌పాస్ట్‌ పథకంలో భాగంగా, కేసముద్రం మార్కెట్‌ గోదాంలో రూ.7 కోట్ల నిధులతో ఏర్పాటు చేస్తున్న కిచెన్‌షెడ్‌ను ఆయన పరిశీలించనున్నారు. స్థానిక పీహెచ్‌సీ ఆవరణలో నూతనంగా నిర్మించే 50 పడకల ఆస్పత్రి, కేసముద్రం విలేజ్‌ జెడ్పీహైస్కూల్‌, ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మించనున్న మున్సిపాలిటీ భవనం కోసం స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు.

పీఆర్సీ అమలు చేయాలి

● టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కవిత

మహబూబాబాద్‌ అర్బన్‌: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీర్సీలను తక్షణమే అమలు చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సిద్దోజు కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్‌ సంఘ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రమేష్‌, మండల అధ్యక్షుడు భిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్లు శ్రీశైలం, సువర్ణ, నాయకులు ఉపేందర్‌, అనిత, రాచకొండ ఉపేందర్‌, సాయిబాబా, కిషన్‌, విష్ణువర్ధన్‌, వీరయ్య, గిరిజ, తదితరులు పాల్గొన్నారు.

జైలుకెళ్లినా.. సర్పంచ్‌ పదవి తొలగించరా ?

గూడూరు: సర్పంచ్‌ పదవిలో ఉండి హత్యాయత్నం, లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లినా.. అతని పదవి తొలగించరా.. అని బాధితులతోపాటు పలువురు గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీహనుమాన్‌తండాకు చెందిన ఆంగోతు స్వరూప, రవీందర్‌ దంపతులను ఆ గ్రామ సర్పంచ్‌ అజ్మీరా రమేష్‌తోపాటు కొందరు తరచూ గొడవ పడుతూ, లైంగిక వేధింపులకు గురిచేశారు. ఈ విషయమై సెప్టెంబర్‌ 10వ తేదీన పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రాత్రి ఇంటికి బయల్దేరగా.. మచ్చర్ల శివారు కొమురంభీంనగర్‌ సమీపంలో సర్పంచ్‌ రమేష్‌తోపాటు కొందరు దాడికి చేశారు. అయితే ఆంగోతు రవీందర్‌ చనిపోయాడని భావించి దాడిచేసినవారు అక్కడనుంచి వెళ్లిపోయారు. వారిపై రెండో ఫిర్యాదు చేయగా.. విచారించిన పోలీసులు సర్పంచ్‌ అజ్మీరా రమేష్‌తోపాటు కొందరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి శిక్ష విధించింది. సర్పంచ్‌ జైలుకు వెళ్లి 50 రోజులైనా పదవి నుంచి ఎందుకు తొలగించడంలేదని బాధితులు ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ పాలన అధికారం ఉప సర్పంచ్‌, లేదా పంచాయతీ కార్యదర్శికి అప్పగించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయమై ఎంపీడీఓ, డీపీఓకు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్య చేపట్టలేదన్నారు. ఇప్పటికై నా కలెక్టర్‌ స్పందించి సర్పంచ్‌గా కొనసాగుతూ జైలుకెళ్లిన వ్యక్తిని సస్పెన్షన్‌ చేయాలని, లేదంటే తమ కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపడుతామన్నారు.

మేడారంలో జాతర సందడి

ఎస్‌ఎస్‌తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మ వనదేవతలు కొలువైన మేడారంలో ముందస్తు జాతర సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ప్రైవేటు వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో గద్దెల ప్రాంగణం సందడిగా కనిపించింది. సుమారుగా 30వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. గద్దెల వద్ద భక్తుల భద్రతకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement