● శిథిలావస్థకు చేరుకున్న ముల్కలపల్లి లోలెవల్ బ్రిడ్జి
● ప్రారంభం కాని కొత్త బ్రిడ్జి పనులు
డోర్నకల్: ఖమ్మం– మహబూబాబాద్ జిల్లా సరిహద్దు ముల్కలపల్లి సమీపంలోని ఆకేరువాగుపై లోలెవల్ వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఖమ్మం, మహబూబాబాద్ మార్గంలోని ఈ వంతెన మీదుగా ప్రతీ రోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, లారీలు, ద్విచక్రవాహనాలు, ఆర్టీసీ బస్సులతో పాటు అనేక భారీ వాహనాలు ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తాయి. కేసముద్రం, చిలుకొయ్యలపాడు, అందనాలపాడు, తొడేళ్లగూడెం తదితర ప్రాంతాల్లోని క్వారీల నుంచి గ్రానైట్ రాళ్ల లారీలు కూడా శిథిలావస్థలో ఉన్న ఈ వంతెన మీదుగానే ఖమ్మం వెళ్తాయి.
1986లో నిర్మాణం
ప్రస్తుతం ఆకేరువాగుపై ఉన్న లో లెవల్ వంతెన 1986లో నిర్మించారు. రెండు జిల్లాల సరిహద్దులోని ఆకేరువాగుపై నిర్మించిన ఈ వంతెన మీదుగా వేలాది వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. ఈక్రమంలో వాహనాల రద్దీ పెరగడం, వర్షాకాలంలో ఆకేరువాగు వరద వంతెన మీదుగా ప్రవహించి రాకపోకలకు అంతరాయం కలగడం, వంతెన శిథిలావస్థకు చేరడంతో 2009లో ఆకేరువాగుపై బ్రిడ్జిని నిర్మించారు. కొత్త బ్రిడ్జి నిర్మాణంతో సమస్య పరిష్కారం కాగా వాహనాల రాకపోకలు కూడా పెరిగాయి.
వరదకు కొట్టుకుపోయిన బ్రిడ్జి..
2024 సెప్టెంబర్‌లో భారీ వర్షాలతో బ్రిడ్జి కొట్టుకుపోయింది. బ్రిడ్జికి సంబంధించి ఏడు ఫిల్లర్లపై భారీ డిస్క్‌స్లాబ్‌లు వరదతో కొట్టుకుపోయాయి. దీంతో లోలెవల్ వంతెన మీదుగా వాహనాల రాకపోకలను పునరుద్దరించారు. భారీ వాహనాల రాకపోకలతో వంతెనకు సంబంధించిన 8వ పిల్లర్‌కు పగుళ్లు రాగా.. ఆర్‌అండ్‌బీ సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో కురవి, కోదాడ హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. హైవే పనుల్లో భాగంగా ఆకేరువాగుపై బ్రిడ్జి కొట్టుకుపోయిన ప్రాంతంలో కొత్త బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. హైవే నిర్మాణ పనులు మందకొడిగా సాగుతుండడంతో కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి చాలా కాలం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న లోలెవల్ వంతెన మరమ్మతులకు గురైతే ఈ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారులు స్పందించి కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


