మహబూబాబాద్: మీ సేవ కేంద్రాల్లో కొనసాగుతున్న సేవలతో పాటు మరికొన్ని సేవలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం సేవలు పెంచడంతో పాటు నిర్వాహకుల కమీషన్ కూడా భారీగా పెంచింది. త్వరలో జిల్లాలో హోం డెలివరీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కార్యాలయాలకు వెళ్లకుండా సర్టిఫికెట్లు వచ్చేలా మీసేవ కేంద్రాల్లో తగు ఏర్పాట్లు చేశారు. మెసేజ్ రాగానే సర్టిఫికెట్లు తీసుకోవచ్చు.
జిల్లాలో 98 మీసేవ కేంద్రాలు..
జిల్లాలోని 18 మండలాల్లో 98 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రధానంగా కులం, ఆదాయం, నివాసం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనన, మరణ, ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు తదితర ధ్రువీకరణ పత్రాలు కేంద్రాల ద్వారా తీసుకుంటున్నారు. వాటితో పాటు అగ్రికల్చర్ ఇన్‌కమ్, ఓపెన్ సైట్‌లో భాగంగా స్కాలర్‌షిప్‌లు, భూభారతి, ఉద్యమం రిజిస్ట్రేషన్లు, గ్యాప్, రేషన్‌కార్డుల్లో కరెక్షన్లు ఇతర సవరణలు చేసుకోవడానికి దరఖాస్తులు చేసుకుంటున్నారు.
ప్రారంభమైన కొత్తసేవలు..
కేంద్రాల్లో పదో తరగతి మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ లేదా ఆ సంవత్సరం చెప్పి ఇతర వివరాలు చెబితే మెమో ఇస్తున్నారు. అలాగే వ్యాపారస్తుల కోసం మెటా సర్వీస్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఆ కేంద్రాల పరిధిలో ఉన్న సెల్ ఫోన్‌లకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్‌లకు వ్యాపార ప్రకటనల వివరాలు వెళ్లిపోతాయి. ఈ విధానం మానుకోట పట్టణంలోని కొన్ని కేంద్రాల్లో అమలు చేస్తున్నారు.
త్వరలోనే మరిన్ని..
సర్టిఫికెట్ భద్రతా సేవ: ఈ సేవను అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యాధునిక భద్రతా ఫీచర్లలో భాగంగా (మీసేవ సర్టిఫికెట్ పేపర్) చిరిగిపోకుండా, నీళ్లు పడినా దెబ్బతినకుండా ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఈ సేవ త్వరలోనే ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు.
హోండెలివరీ : ప్రస్తుతం హైదరాబాద్‌లో సర్టిఫికెట్ల హోం డెలివరీ సేవ జరుగుతోంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత సర్టిఫికెట్ పూర్తి కాగానే దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి సర్టిఫికెట్లు ఇచ్చే సేవ జిల్లాలో కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.
పెరిగిన కమీషన్..
ప్రభుత్వం సేవలు పెంచడంతో పాటు కేంద్రాల నిర్వాహకులకు కమీషన్ కూడా భారీగా పెంచినట్లు ఈ డిస్ట్రిక్ మేనేజర్ యుగేంధర్ తెలిపారు. గతంలో కులం, ఆదాయం, నివాసం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌కు కమిషన్ రూ.15 ఇస్తే, ఇప్పుడు రూ.40 ఇస్తుందని, అన్ని సేవల కమీషన్ పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
జిల్లాలో త్వరలో ప్రారంభం కానున్న హోం డెలివరీ
మీసేవ కేంద్రాల నిర్వాహకులకు
పెరిగిన కమీషన్
మొత్తం 98 సెంటర్లు
త్వరలో అన్ని సేవలు ప్రారంభం
జిల్లాలో కొన్ని నూతన సేవలు ప్రారంభం కాగా.. త్వరలోనే హోం డెలివరీతో పాటు సర్టిఫికెట్ల భద్రతా సేవలు ప్రారంభం కానున్నాయి. నిర్వాహకులకు కమీషన్ కూడా ప్రభుత్వం భారీగానే పెంచింది. నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగా కేంద్రాలను నిర్వహించాలి.
– యుగేంధర్, ఈ డిస్ట్జ్జ్రిక్ట్ మేనేజర్


