మహబూబాబాద్ అర్బన్ : జిల్లాలో సంక్షేమ హాస్టళ్లకు కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్, కోడిగుడ్లు, కిరాణా సామగ్రి సరఫరా చేసే టెండర్‌దారులకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్రజాప్యం జరుగుతోంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ బిల్లులు పెండింగ్ ఉండడంతో అప్పులు చేసి సరుకులు రావాణా చేస్తున్నామని టెండర్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, బిల్లుల చెల్లింపుల కోసం ఖజానాశాఖ, వివిధ సంక్షేమ శాఖల అధికారులకు కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని కొందరు సరఫరాదారులు ఆరోపిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో కూరగాయలు, పండ్లు, కిరాణా సామగ్రి టెండర్‌దారులకు సుమారు రూ.15 కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉంది.
విద్యార్థుల సంక్షేమమే ప్రాధాన్యం..
గురుకుల హాస్టళ్ల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కూరగాయల టెండర్లు, బిల్లుల చెల్లింపుల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ, బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరఫరాదారులు బిల్లుల ఆమోదం, చెల్లింపుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారుల పాత్రపై విచారణ జరపాలి. సంక్షేమ హాస్టళ్లకు సరుకులు సరఫరా చేసే టెండర్లు, సరఫరా రికార్డులు, బిల్లుల ఆమోదం, చెల్లింపుల వివరాలను ఉన్నతాధికారులు పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. కమీషన్ డిమాండ్‌పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను వెలికితీసేందుకు సమగ్ర విచారణ చేపట్టాలని, ఆరోపణలు రుజువైతే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అప్పులు చేసి హాస్టళ్లకు
కూరగాయల సరఫరా
హాస్టళ్లు, గురుకులాలకు కూరగాయలు, పండ్లు సరఫరా చేస్తున్నాం. బిల్లులు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని బిల్లులు రాకున్నా అప్పు చేసి హాస్టళ్లకు సమయానికి కూరగాయలు అందిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నాం.
– కె.సత్యనారాయణ,
కూరగాయల టెండర్‌దారుడు, మానుకోట
సంక్షేమ హాస్టళ్లకు సరుకుల సరఫరా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం
అప్పులు అవుతున్నాయని టెండర్‌దారుల ఆవేదన
అధికారులు స్పందించాలని డిమాండ్


