మొక్కజొన్నకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్నకు ప్రాధాన్యం

Oct 20 2026 4:31 AM | Updated on Oct 20 2026 4:31 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : జిల్లాలో యాసంగి సీన్‌లో మొత్తం 2,97,925 ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు పంటల వారీగా సాగు విస్తీర్ణ ప్రణాళికను రూపొందించింది. జిల్లాలో మొక్కజొన్న సాగుకు రైతులు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అంచనా. మొక్కజొన్న తర్వాత వరి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండనుంది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిల్లాలో 1,48,400 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయనున్నారు. వరి 1,00,514 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. ఈ రెండు పంటల విస్తీర్ణమే మొత్తం సాగు అంచనాలో సింహభాగంగా ఉంది. వీటితోపాటు అపరాలు, నూనెగింజల పంటల సాగుకు కూడా ప్రణాళిక రూపొందించారు.

వరి సాగు తగ్గిద్దాం..

ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యాసంగి సాగులో నీటి లభ్యతే పంటల ఎంపికకు ప్రామాణికం కావాలి. అందుబాటులో ఉన్న నీటి వనరులను అంచనా వేసుకుని, తక్కువ నీటితో సాగయ్యే స్వల్పకాలిక పప్పుదినుసులు, నూనె గింజల పంటలకు ప్రాధాన్యతనిస్తూ రైతన్నలు సాగు ప్రణాళిక రూపొందించుకోవాలి. ‘నీటిని కాపాడుకుందాం.. పంట నష్టాలను నివారించుకుందాం.. రైతు ఆదాయాన్ని పెంచుకుందాం.. నీటి లభ్యత ఆధారంగా సాగు.. అదే యాసంగిలో రైతుకు భరోసా అని’ ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు.

అపరాలు, నూనెగింజలపైనా దృష్టి..

జిల్లాలో పెసర 15,195 ఎకరాల్లో, జొన్న 12,557 ఎకరాల్లో, మినుము 10,662 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వేరుశనగ 6,212 ఎకరాల్లో, ఇతర పంటలను 4,285 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కుసుమ సాగు విస్తీర్ణం 100 ఎకరాలుగా అంచనా వేశారు. పంటల వారీగా సాగు విస్తీర్ణాలను నిర్ధారించడం ద్వారా యాసంగి సీజన్‌కు అవసరమైన వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేశారు.

నీటి లభ్యతను బట్టి సాగు..

యాసంగి సీజన్‌ పంటల సాగు ఎంపిక విషయంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నీటి లభ్యత, మార్కెట్‌లో పంటలకు ఉన్న డిమాండ్‌, అనుకూల వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సాగు చేపట్టాలని పేర్కొంటున్నారు. నీటి వనరులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా సాగు ఖర్చులను నియంత్రించుకోవడంతో పాటు ఆశించిన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

2.97 లక్షల ఎకరాల్లో పంటలు..

జిల్లాలో యాసంగిలో 2.97 లక్షల ఎకరాలకు పైగా సాగు ప్రణాళిక సిద్ధం కావడంతో వ్యవసాయ శాఖ పంటల సాగుపై అంచనాలను రూపొందించింది. ఈ ప్రణాళికకు అనుగుణంగా రైతులు సాగు నిర్ణయాలు తీసుకోవడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం కీలకంగా మారనుంది.

నీటి లభ్యతకు అనుగుణంగా సాగు చేయాలి

రబీ సీజన్‌లో రైతులు నీటి లభ్యత, మార్కెట్‌ డిమాండ్‌, అనుకూలమైన వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పంటల సాగు చేపట్టాలి. నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు సాగు చేసి రైతులు పంట నష్టాలను నివారించుకుని, ఆదాయాన్ని పెంచుకోవాలి. ఎల్‌నినో ప్రభావిత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే యాసంగి సాగులో నీటి లభ్యతే పంటల ఎంపికకు ప్రామాణికం కావాలి.

– ఎస్‌.విజయచంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి

రెండో స్థానంలో వరిపంట

యాసంగిలో 2.97లక్షల ఎకరాల్లో సాగు అంచనా

ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement