సాక్షి, మహబూబాబాద్: ఒకవైపు ఎల్‌నినో భయం.. మరోవైపు తక్కువ వర్షాలు, అడుగంటిన భూగర్భ జలాలతో ఇబ్బందులు పడి పండించిన ధాన్యం.. పచ్చిగా ఉన్నప్పుడే కొనేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. రైతులు హార్వెస్టర్‌తో కోత షురూ చేయగానే అక్కడికే వెళ్లి పచ్చి సన్నధాన్యం క్వింటాకు ధర రూ. 3వేల నుంచి రూ. 3500 మేరకు పెట్టి కొంటున్నారు.ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లతోపాటు, మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యాపారులు పోటీపడడంతో తమ పంటకు డిమాండ్ పెరిగిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తగ్గిన సాగు.. పెరిగిన డిమాండ్
వానాకాలం సీజన్‌లో సకాలంలో వర్షాలు కురువలేదు. దీంతో గత ఏడాది 2,30,724 ఎకరాల్లో వరి సాగుచేస్తే ఈ ఏడాది 1,93,000లకే పరిమితం అయ్యింది. ఇందులో అత్యధికంగా సన్న రకాలు సాగుచేశారు. అయితే సాగు విస్తీర్ణం తగ్గడం, మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఏపీలో కూడా సాగు తగ్గింది. దీంతో సన్న ధాన్యానికి డిమాండ్ పెరిగింది. గత ఏడాది సన్నధాన్యం బహిరంగ మార్కెట్‌లో క్వింటాకు రూ. 2500 నుంచి రూ. 3000 పలికింది. ఇప్పుడు బియ్యం రేటు కూడా రూ.7,500 నుంచి రూ. 8వేల మేరకు పలుకుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు సన్నధాన్యం కొనేందుకు పోటీ పడుతున్నారు.
పచ్చిధాన్యమే కొంటూ..
జిల్లాలో పెద్దవంగర, తొర్రూరు, దంతాలపల్లి ప్రాంతాల్లోనే వరి కోతలు మొదలయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు పెరగడం, భవిష్యత్‌లో కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ముందే గుర్తించిన వ్యాపారులు సన్నధాన్యం ప్రధానంగా జై శ్రీరాం, చింట్లు, సాంబమసూరి వంటి రకాలను పచ్చిగా ఉన్నప్పుడే క్వింటాకు ధర రూ.3,500 మేరకు పెట్టి కొంటున్నారు. ఇప్పుడే ఇలా కొంటే ధాన్యం ఎండితే 30శాతం మేరకు బరువు తగ్గుతుంది. ఈ విషయం తెలిసినా.. పచ్చధాన్యం కొనడంపై చర్చ జరుగుతోంది. అయితే యాసంగిలో ధాన్యం పండించే అవకాశం తక్కువగా ఉండడం, మహా రాష్ట్రలో పండకపోవడంతో ధాన్యం కొనుగోలు చేసి నిల్వ ఉంచితే తర్వాత రెట్టింపు ధరకు బియ్యం అమ్ముకోవచ్చని వ్యాపారులు ఉత్సాహం చూపుతున్నట్లు తెలిసింది. అదేవిధంగా పలువురు మిల్లర్లు గత వానాకాలంలో కొనుగోలు కేంద్రాల నుంచి దిగుమతి చేసుకున్న ధాన్యం సీఎంఆర్ పెట్టకుండా అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సివిల్ సప్లయీస్ అధికారులు సీఎంఆర్ పెట్టమని ఒత్తిడి పెంచారు. దీంతో సీఎంఆర్ పెట్టేందుకు మిల్లర్లు కూడా ధాన్యం కొంటున్నారని, అందుకోసమే డిమాండ్ పెరిగిందని చర్చ జిల్లాలో జరుగుతోంది.
సంతోషంగా అమ్ముతున్న రైతులు..
కాయకష్టం చేసి ధాన్యం పండిస్తే ధరలేక కొంతకాలం, దళారుల ఇబ్బందులతో మరికొంత కాలం.. కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు మొదలైన ఇబ్బందులను చవిచూసిన రైతులు పొలం వద్ద వరి కోసిన వెంటనే మంచి ధర పెట్టి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడటంతో సంతోషంగా ధాన్యం అమ్ముతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం, క్లీనింగ్ చేసి రోజుల తరబడి నిరీక్షించి అమ్మితే బోనస్‌తో కలిపి క్వింటాకు రూ. 2,961 మాత్రమే ఇస్తారని.. ఏ ఇబ్బంది లేకుండా బహిరంగం మార్కెట్‌లో రూ. 3,500 పలుకుతుంది. ఇదే కొనసాగితే ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అంచనాలో నాల్గో వంతుకూడా ధాన్యం రాకపోవచ్చని అధికారులు అంటున్నారు. ఏది ఏమైనా తాము పండించిన ధాన్యానికి మంచి ధర పలకడం శుభసూచికంగా రైతులు చెబుతున్నారు.
కల్లం వద్దే ధాన్యం కొనుగోళ్లు
సన్నధాన్యానికి పెరిగిన డిమాండ్
క్వింటాకు రూ.3వేలకుపైగా ధర
సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు


