● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: ఎల్‌నినో నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ స్నేహశబరీష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం వ్యవసాయం, నీటి పారుదల, విద్యుత్ తదితర విషయాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. మొత్తంగా జిల్లాలో మైనస్ 24శాతం వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. తాగు, సాగు నీరు అవసరాలకు సరిపడా అంచనాలు గ్రామస్థాయిలో సిద్ధం చేసి ముందుకు సాగాలన్నారు. పంటలకు సరిపడా విద్యుత్‌ను పొదుపుగా అందించాలన్నారు. ఇందుకు సంబంఽధిత అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. ఈనెల 22నుంచి నవంబర్ 30వరకు ఖేత్ బచావో అభియాన్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


