స్లో పాలన.. గాడినపడేదెట్లా? | - | Sakshi
Sakshi News home page

స్లో పాలన.. గాడినపడేదెట్లా?

Oct 18 2026 1:36 AM | Updated on Oct 18 2026 1:36 AM

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ ఆవిర్భవించి ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే కొన్నేళ్లుగా యూనివర్సిటీలో కొన్ని సమస్యలు అపరిష్కృతంగానే ఉంటున్నాయి. కేయూ రెగ్యులర్‌ వీసీగా హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ జూవాలజీ విభాగం రిటైర్డ్‌ ఆచార్యులు కె. ప్రతాప్‌రెడ్డి నియమితులై ఈనెల 18వ తేదీ(ఆదివారం)తో రెండేళ్లు పూర్తవుతుంది. ఈ రెండేళ్లపాటు పాలన స్లోగా కొనసాగిస్తూ వస్తున్నారు. దీంతో ఆయన పాలనపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. వీసీకి మరో సంవత్సరంపాటు మాత్రమే పాలన మిగిలి ఉంది.

ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమల్లోకి తీసుకొచ్చినా..

కేయూలో ఉద్యోగులు, అధ్యాపకులు సమయపాల న పాటించడం లేదని భావించి కొంతకాలం క్రిత మే ముఖ గుర్తింపు హాజరు(ఎఫ్‌ఆర్‌ఎస్‌ )విధానం అమల్లోకి తీసుకొచ్చారు. కొద్దిగా మార్పు కనిపించి నా ఆశించిన స్థాయిలో అమలు కావడంలేదు. కొందరు హాజరు వేసి వెళ్లిపోతున్న పరిస్థితి కూడా ఉంది. తరగతులు సక్రమంగా జరగాలంటే పర్యవేక్షణ అధికారుల తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ పట్టించుకోవడం లేదు. ప్రాక్టికల్స్‌ కూడా మొక్కుబడిగానే నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

క్రమశిక్షణ తప్పుతున్నా చర్యలు లేవు..

కేయూ హాస్టళ్లలో (బాయ్స్‌) తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. అయినా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలున్నాయి. మరోవైపు నాన్‌బోర్డర్ల సమస్య తీవ్ర రూపం దాల్చింది. కొందరు నాన్‌ బోర్డర్లు కామన్‌మెస్‌, న్యూపీజీ బాయ్స్‌హాస్టల్‌ మెస్‌ను వినియోగించుకుంటున్నారు. దీంతో విద్యార్థులకు బిల్లులు ఎక్కువ వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్టళ్ల నిర్వహణలో అవకతకవలు చోటుచేసుకుంటున్నాయని వెలుగులోకి వచ్చినా బాధ్యులపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

కమిటీలు వేసి

చర్యలు తీసుకోవడంలో జాప్యం..

ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు వచ్చిన తప్పనిసరిగా వీసీ ప్రతాప్‌రెడ్డి కమిటీలు వేస్తున్నారు. అయితే చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆలస్యంగానైనా పలువురిపై చర్యలు తీసుకున్నారు. అయితే మాజీ హాస్టళ్ల డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్లపై వచ్చిన ఆరోపణలపై రెండు విచారణ కమిటీలు వేసి నివేదికలు ఇచ్చాక పాలకమండలి సమావేశంలో చర్చకు పెట్టడంతో మరోసారి పాలకమండలి సభ్యులతో ముగ్గురిపై మళ్లీ విచారణ కొనసాగిస్తున్నారు.

ప్రహరీ నిర్మాణామెప్పుడో?

కాకతీయ యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకుండా చుట్టూ 10 కి.మీ మేర రూ. 20 కోట్ల వ్యయంతో ప్రహరీ నిర్మించేందుకు ఉపక్రమించడంలో జాప్యం జరుగుతోంది. ఓ ప్రభుత్వ సంస్థకు అప్పగించగా టెండర్‌ కూడా పిలిచారని, అయితే ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు.

● వీసీ ప్రతాప్‌రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు రూ.400 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

రెండేళ్ల పాలనలో వీసీ ఏం చేశారంటే..

కాకతీయ యూనివర్సిటీలో ప్రతిష్టాత్మక తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్‌ను విజయవంతంగా నిర్వహించారు.

కేయూ 23వ స్నాతకోత్సవం నిర్వహించారు.

కేయూహబ్‌తో టీహబ్‌ మధ్య అవగాహన ఒప్పందంకుదుర్చుకున్నారు.ప్రస్తుతం 100మంది విద్యార్థులకు టీహబ్‌సహకారంతో మెంటర్‌ షిప్‌గా శిక్షణ ఇస్తున్నారు.

విద్యార్థుల్లో స్కిల్స్‌ పెంచేందుకు, అలాగే వివిధ కార్యక్రమాల అమలుకు పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదర్చుకున్నారు. జర్మనీ యూనివర్సిటీస్‌ గ్రూప్‌ సంస్థలతోనూ ఎంఓయూ చేసుకున్నారు.

యూనివర్సిటీలో సుమారు రూ. 5కోట్లతో నిర్మించిన కెహబ్‌ను రెండేళ్‌లైనా వినియోగంలోకి తీసుకురాలేకపోయారు. టీహబ్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నాక వారి సూచనల మేరకు మళ్లీ కెహబ్‌లో ఇంటీరియర్‌ వర్క్స్‌ రూ. 5కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. మరోనెలరోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

కేయూలో వివిధ విభాగాల్లో రూ.35 కోట్లతో సైన్స్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఐదు రీసెర్చ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు.

సైన్స్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టుల పరిశోధనల కోసం యూనివర్సిటీలో సెంట్రల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ సెంటర్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

పీజీ కోర్సుల సిలబస్‌ను నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా కొంత మార్పు చేయించారు.

గతంలో కంటే కేయూకు బ్లాక్‌ గ్రాంట్‌ పెంపుదలకు కృషి చేశారు.

కేయూ కోఎడ్యుకేషన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు వెళ్లేలా రూ. కోటికిపైగా నిధులతో రోడ్డు నిర్మాణం ఇటీవలే పూర్తి చేయించారు.

2010లో నియమితులైన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించారు.

కేయూలో డిప్యూటీ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు, సూపరింటెండెంట్లు, లైబ్రరీ అసిస్టెంట్‌ల గ్రేడ్‌ల పదోన్నతులు కల్పించారు.

కేయూలో పీజీ కోర్సుల్లో విద్యార్థినుల అడ్మిషన్లు పెరిగాయి. అయితే వారికి సరిపడా హాస్టళ్ల భవనాలు లేవు.

నేటితో కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి

రెండేళ్ల పాలన పూర్తి

కమిటీలు వేయడం..

చర్యలు తీసుకోవడంలో జాప్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement