‘నారాయణపురం’.. సర్వే పాఠం | - | Sakshi
Sakshi News home page

‘నారాయణపురం’.. సర్వే పాఠం

Oct 18 2026 1:30 AM | Updated on Oct 18 2026 1:30 AM

● మోడల్‌గా తీసుకొని ఇతర జిల్లాల్లో సర్వేలు

● రీ సర్వేలో సమస్యల పరిష్కారానికి మానుకోటకు వచ్చిన సిరిసిల్ల అధికారులు

● ఇక్కడి అధికారుల పనితీరుపై ప్రశంసలు

సాక్షి, మహబూబాబాద్‌: భూమి హక్కును కోల్పోయి పది సంవత్సరాలు ఇబ్బందులుపడ్డ జిల్లాలోని కేసముద్రం మండలం నారాయణపురం గ్రామం గతంలో గల్లీ నుంచి అసెంబ్లీ వరకు చర్చనీయాంశమైంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే.. ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి చట్టం తీసుకొచ్చి నారాయణపురంలో ప్రతీ అంగుళాన్ని సర్వే చేసి రైతులకు పట్టాలు పంపిణీ చేసింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న భూము ల రీ సర్వే, ఆయా ప్రాంతాల్లో తలెత్తే సమస్యలకు నారాయణపురం సర్వే ఓ పాఠంగా మారింది. సర్వే చేయడంలో మెలకువలు, సాఫీగా సర్వే చేయడం ఎలా అని ఇతర జిల్లాల అధికారులు మానుకోట రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన అధికారులు మానుకోటకు వచ్చి సర్వే తీరు.. సమస్యలకు పరిష్కారం తెలుసుకోవడం గమనార్హం.

యజ్ఞంలా నారాయణపురం భూ సర్వే

ప్రభుత్వానికే ప్రతిష్టాత్మకమైన నారాయణపురం సర్వేను జిల్లా అధికారులకు యజ్ఞంలా నిర్వహించారు. గ్రామంలో 43 సర్వే నంబర్లు, 1,827.12 ఎకరాల భూమి ఫారెస్టు పరిధిలో నమోదైంది. అయితే గత ప్రభుత్వం రైతులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. భూమి, సర్వే నంబర్ల మధ్య తేడా ఉండడంతో ఆగిపోయింది. భూ భారతి చట్టంలో రెండు బృందాలు 160రోజులు సర్వే చేశాయి. దీంతో 780 మంది రైతులకు చెందిన 1,468 ఎకరాల భూమి ఏ అడ్డంకులు లేకుండా ఉన్నట్లు తేలింది. దీంతో ఈనెల 31న వారికి పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన 129 మంది రైతులకు చెందిన 149 ఎకరాల భూమి సర్వే నంబర్‌ 117లో ఉంది. ఈ నంబర్‌ ఫారెస్టు భూమిలో చూపిస్తుంది. ఇలా ప్రతీ అంశాన్ని కూలంకుశంగా పరిశీలించి తుది జాబితాను, పట్టా పాస్‌ పుస్తకాలను రూపొందిస్తున్నారు.

మార్గదర్శంగా మన సర్వే..

భూ భారతి చట్టంలో పొందుపరిచిన వివరాలను గుర్తించి భవిష్యత్‌లో సమస్య రావొద్దని ప్రభుత్వ రీ సర్వే చేస్తుంది. ఇందుకోసం అధునాతన పరికరాలు, పరిజ్ఞానం ఉపయోగించడంలో భాగంగా ఒకొక్కటి రూ.5లక్షల విలువచేసే 19 రోవర్లు సిద్ధం చేశారు. గ్రామాల మధ్య సరిహద్దుల నిర్ధారణ, గ్రామంలోని మొత్తం భూమి, అందులో ప్రభుత్వ భూములు, గుట్టలు, చెరువులు, సాగు భూమి సర్వే నంబర్ల వారీగా విభజన చేసి సర్వే చేస్తారు. అయితే వీటిని అనుసంధానం చేయడం, ఆన్‌లైన్‌ ఎంట్రీలు, రైతులకు నోటీసులు ఇవ్వడం, కొత్తవారి పేర్లు నమోదు, విస్తర్ణలో హెచ్చుతగ్గులను సరిచేయడం, వారసత్వ భూముల నమోదు, ఆర్‌ఓఆర్‌ మొదలైన విషయాలను తెలుసుకునేందుకు ఇతర జిల్లాల నుంచి అధికారులు వస్తున్నారు. కొందరు ఫోన్‌లో ఇక్కడి అధికారులతో మాట్లాడుతుండగా.. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావ్‌పేట, చందుర్తి మండలాల సమస్యల నివృత్తికి ఆ జిల్లా ఆర్డీఓ, సర్వే ఏడీ, తహసీల్దార్లు, సర్వేయర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఇక్కడకు వచ్చి సర్వేను నేరుగా చూడడం గమనార్హం.

ఎన్నో విషయాలు తెలుసుకున్నాం

నారాయణపురం గ్రామంలో రీ సర్వే చేసిన తీరు రాష్ట్రానికే ఆదర్శం. జిల్లాలో జరుగుతున్న రీ సర్వేను నేరుగా పరిశీలించాం. మాకు తలెత్తిన సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకున్నాం. ఇక్కడి అధికారులు మా బృందానికి అన్ని విధాలుగా సహకరించారు. ప్రతీ విషయాన్ని వివరించారు.

–డి.శ్రీనివాస్‌, ఆర్డీఓ, సిరిసిల్ల జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement