● అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
కురవి : గణపతి నిమజ్జనానికి మిత్రుడి ఊరికి వచ్చి అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గుండ్రాతి మడుగు (విలేజి) శివారులో సోమవారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఎల్ది నరేష్ (31) హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. గణనాథుడి నిమజ్జనానికి మండలంలోని గుండ్రాతిమడుగు (విలేజి) గ్రామానికి చెందిన స్నేహితుడి ఇంటికి శుక్రవారం (25వ తేదీ) వచ్చాడు. చర్చి ఎదుట ఏర్పాటు చేసిన గణపతి మండపం నిర్వాహకులతోపాటు స్నేహితుడు హరీష్‌తో కలిసి నిమజ్జన సంబురాల్లో పాల్గొన్నాడు. కాగా నరేష్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. అయితే ఇంటికి వెళ్తానని మిత్రుడితో చెప్పడంతో ఇప్పుడొద్దు అన్నం తిని ఇక్కడే పడుకోవాలని ఎంత చెప్పినా వినకుండా బైక్‌పై నరేష్ పెద్దతండా వైపు వెళ్లిపోయాడు. కల్వర్టు దాటిన తర్వాత రోడ్డు పక్కన పొలంలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం పెద్దతండాకు చెందిన జీపీ ట్రాక్టర్‌లో చెత్తను తీసుకుని వస్తున్న వారికి పొలంలో బైక్, ఆ పక్కనే మృతదేహం పడి ఉండడాన్ని చూసి స్థానికులకు వివరించారు. కురవి పోలీసులకు సమాచారాన్ని తెలియచేశారు. మృతుడి జేబులోని సెల్‌ఫోన్ ఆధారంగా జయ్యారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుళ్లిపోయిన మృతదేహాన్ని మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నరేష్ మృతి చెందాడనే విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వచ్చారు. రోడ్డు ప్రమాదం జరిగి పొలంలో పడిపోయాడా? ఎవరైనా ఢీకొట్టారా? ఎవరైనా కొట్టిపడేశారా? అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇదే విషయమై కురవి ఎస్సై సతీష్‌ను వివరణ కోరగా ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. మృతుడికి భార్య సంధ్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
విద్యుదాఘాతంతో మహిళ మృతి
హన్మకొండ చౌరస్తా : విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందిన ఘటన ఆదివారం సాయంత్రం హనుమకొండలోని సుధానగర్‌లో చోటుచేసుకుంది. మృతురాలి కుమార్తె తిగుల్ల యమున కథనం ప్రకారం.. సుధానగర్‌కు చెందిన రుద్రారం లక్ష్మి (58) స్నానం చేసేందుకు వేడి నీటి కోసం బకెట్‌లో హీటర్ పెట్టింది. నీరు వేడైనా తర్వాత హీటర్‌ను తీసివేసే క్రమంలో చేయి తగిలి విద్యుత్ షాక్ గురైంది. గమనించిన కూతురు స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందింది. యమున ఫిర్యాదు మేరకు హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎక్స్‌ప్రెస్ బస్సుల తగ్గింపుతో ప్రమాదం
● బస్సు దిగుతూ ప్రమాదానికి గురైన మహిళ
● టైరు కిందపడి నుజ్జునుజ్జయిన కాలు
హన్మకొండ : ఎక్స్‌ప్రెస్ బస్సుల తగ్గింపు ప్రమాదాలకు దారి తీస్తుంది. హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి హైదరాబాద్‌తో పాటు పలు ప్రధాన రూట్లలో ఎక్స్‌ప్రెస్ బస్సులు చాలా వరకు తగ్గించింది. దీంతో వచ్చిన బస్సు మహిళా ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రేగొండ మండలం దమ్మన్నపేటకు చెందిన అత్తకోడలు చుక్క నిర్మల, గౌతమి హైదరాబాద్ వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కారు. సీటు దొరక్కపోవడంతో పాటు నిలబడేందుకు కాలు పెట్టే స్థలం లేకపోవడంతో నిర్మల బస్సు దిగుతుండగా బస్సు కదలడంతో కింద పడిపోయింది. ఆమె ఎడమ కాలుపై నుంచి టైరు వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయింది. వెంటనే చికిత్స కోసం 108లో ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. కాగా నిర్మల భర్త శ్రీనివాస్, కుమారుడు వెంకటేశ్ మాట్లాడుతూ..ఈ ప్రమాదానికి ఆర్టీసీ పూర్తి బాధ్యత వహించాలని, వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు.


