ఉమ్మడి వరంగల్ జిల్లాలో
ప్రత్యేక సవరణ ప్రక్రియ వేగవంతం
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వేగం పుంజుకుంది. ఓటర్ల వివరాల పరిశీలనలో భాగంగా అధికారులు జారీ చేసిన నోటీసుల పంపిణీ దాదాపు తుది దశకు చేరుకుంది. సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆరు జిల్లాల్లో కలిపి 6,45,763 నోటీసులు జారీ చేయగా.. 6,28,499 మంది ఓటర్లకు చేరాయి. మరోవైపు ఇప్పటివరకు 4,39,603 విచారణలు పూర్తయ్యాయి. అభ్యంతరాలు, దరఖాస్తులు, రికార్డుల పరిశీలన అనంతరం తుది ఓటర్ల జాబితా ప్రచురణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
నోటీసుల పంపిణీలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలో జారీ చేసిన 32,636 నోటీసులనూ ఓటర్లకు అందజేశారు. అంటే నోటీసుల పంపిణీలో 100 శాతం పూర్తయింది. ఇందులో 32,458 విచారణలు పూర్తయ్యాయి. కేవలం 78 విచారణలు మాత్రమే గడువు దాటినవిగా నమోదయ్యాయి.
వరంగల్ జిల్లాలో అత్యధికంగా 1,94,395 నోటీసులు జారీ అయ్యాయి. వీటిలో 1,84,448 పంపిణీ కాగా.. ఇంకా 9,947 నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు 90,054 విచారణలు పూర్తయ్యాయి. 18,689 దరఖాస్తులను ధ్రువీకరించగా.. తుది ప్రచురణకు 81,460 ప్రతిపాదనలు ఆమోదం పొందాయి.
హనుమకొండ జిల్లాలో 1,32,070 నోటీసులకు గాను 1,31,602 పంపిణీ చేశారు. కేవలం 468 నోటీసులు మాత్రమే పంపిణీ కావాల్సి ఉంది. జిల్లాలో 1,07,163 విచారణలు పూర్తయ్యాయి. 30,401 దరఖాస్తులను ధ్రువీకరించగా.. 95,637 రికార్డులు తుది ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.
జనగామ జిల్లాలో 1,63,890 నోటీసులు జారీ చేసి 1,62,862 పంపిణీ చేశారు. ఇంకా 1,028 నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు 1,21,025 విచారణలు పూర్తయ్యాయి. గడువు దాటిన విచారణలు 42,063గా నమోదయ్యాయి. తుది ప్రచురణకు 1,10,661లు సిద్ధంగా ఉన్నాయి.
మహబూబాబాద్‌లో 80,872 నోటీసులకు గాను 76,688 పంపిణీ అయ్యాయి. 60,687 విచారణలు పూర్తయ్యాయి. 56,678 ప్రతిపాదనలు తుది ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ములుగులో 41,900 నో టీసులకు గాను 40,263 పంపిణీ చేశారు. 28,216 విచారణలు పూర్తి కాగా.. 24,509లు తుది ప్రచురణకు సిద్ధమయ్యాయి.
6.28 లక్షల నోటీసులు..
4.39 లక్షల విచారణలు పూర్తి
తుది జాబితాకు 3.83 లక్షలు సిద్ధం
నివేదిక విడుదల చేసిన అధికారులు


