మహబూబాబాద్: నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు ఇతరత్రా విపరీతంగా పెరిగి పేదలపై తీవ్రభారం పడుతోంది. దీనికి తోడు తూనికలు, కొలతల అఽధికారి తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు బాట్లకు బదులు రాళ్లతో తూకం వేయడంతో పాటు, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. అలాగే కాలం చెల్లిన వస్తువులు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు.
జిల్లాలో 1,200కిపైగా కిరాణా షాపులు..
జిల్లాలో సుమారు 1,200వరకు కిరాణా షాపులు, 22 వరకు సూపర్ మార్కెట్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. తూనికలు, కొలతల శాఖ పరిధిలో కిరాణా షాపులతో పాటు కూరగాయల షాపులు, బేకరీలు, వేబిడ్జ్రిలు, పెట్రోలు బంకులు, వెండి, బంగారం షాపులు, స్వీట్స్, మటన్, చికెన్‌షాపులతో పాటు ఇతరత్రా ఉన్నాయి. తూకం, ఎమ్మార్పీ తదితర అంశాలను ఆశాఖ అధికారులు తనిఖీ చేయాల్సి ఉంది.
బాట్లకు బదులు రాళ్లు..
కొంతమంది కూరగాయలు, పండ్ల వ్యాపారులు, పలు కిరాణా షాపుల్లో కూడా బాట్లకు బదులు రాళ్లు వినియోగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో సగానికి పైగా వ్యాపారులు రాళ్లు వాడుతున్నారంటే.. మండలాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
నిబంధనలకు విరుద్ధంగా..
సూపర్ మార్కెట్‌లో తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ కాంటాలు వాడాలి. కిరాణాషాపుల్లో కూడా వాటినే వాడాలని అఽధికారుల చెబుతున్నారు. కానీ, చాలా మంది వ్యాపారులు మ్యానువల్ కాంటాలు వాడుతున్నారు. వాటితో తూకంలో కొంత తేడా ఉంటుంది. వాటిని అరికట్టడంలో అఽధికారులు విఫలమవుతున్నారు. బేకరీ, స్వీట్, కిరాణా షాపుల్లో కొంతమంది వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అలాగే బేకరీ, స్వీట్ షాపుల్లో కాలంచెల్లిన తినుబండారాలు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ముద్రలు అంతంత మాత్రమే..
బాట్లకు రెండేళ్లకోసారి ముద్రలు వేయించాలి. ఎలక్ట్రానిక్ కాంటాలు అయితే సంవత్సరానికి ఒకసారి ముద్ర వేసుకోవాలి. కానీ, చాలామంది వ్యాపారులు ఆ నిబంధన పాటించకపోవడంతో తూకంలో తేడాలు వస్తున్నాయి. మటన్, చికెన్ షాపుల్లో కాంటాలకు ముద్రలు లేకపోవడంతో తూకంలో చాలా తేడా వస్తోంది.
పెట్రోలు బంకుల్లో దారుణం..
జిల్లా కేంద్రంలోని పలు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ తక్కువగా వస్తుందని తరచూ గొడవలు జరుగుతున్నాయి. కల్తీ విక్రయాలు జరుగుతున్నాయని, వాహనాలు పాడైపోతున్నాయని ఇలాంటి అనేక సమస్యలపై వాహనదారులు ఆందోళన చేసి సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని బంకుల్లో మరుగుదొడ్లు, ఇతర సౌకార్యాలు లేకున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
రెండు జిల్లాలకు ఒక్కరే..
జిల్లాకు రెండు సంవత్సరాలుగా ఇన్‌చార్జ్ తూనికలు, కొలతల అధికారి కొనసాగుతున్నారు. హనుమకొండ జిల్లా తూనికలు, కొలతల అధికారి విశ్వేశ్వర్ మానుకోట జిల్లా ఇన్‌చార్జ్‌గా ఏడు నెలల నుంచి పని చేస్తున్నారు. వాస్తవానికి ఆశాఖకు ఒక తూనికలు, కొలతల అధికారి, టెక్నికల్ అసిస్టెంట్, అటెండర్ ఉండాలి. అయితే కేవలం టెక్నికల్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నాడు. అటెండర్ ఉండగా వరంగల్‌కు డిప్యుటేషన్ వేశారు.
తనిఖీలు లేకనే..
ప్రతీ నెల తనిఖీలు ఉంటే వ్యాపారుల్లో భయం ఉండేది. కానీ, రెండేళ్లగా తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేసి కేసులు పెట్టి ముద్రలు వేస్తే తూకం సమస్య ఉండదు. తనిఖీ చేసి అసిస్టెంట్ కంట్రోలర్‌కు పంపితే వారి ఆదేశాలతో సదరు వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే..
వినియోగదారులు ఫిర్యాదు చేస్తేనే తనిఖీలు నిర్వహిస్తున్నారు. కనీసం నెలకు నాలుగుసార్లు అయినా తనిఖీలు చేసి కేసుల నమోదుతో పాటు జరిమనాలు విధిస్తే దందా చేసే వ్యాపారుల్లో మార్పు వస్తుంది. సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, తూకం విషయంలో తనిఖీ లు ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
తనిఖీలు చేస్తున్నాం..
జిల్లాలో తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేసులతో పాటు జరిమానా విధిస్తున్నాం. కాంటాలు, బాట్లకు ముద్ర వేసుకోవాలి. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. తూకంలో తేడా ఉన్నా.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవు.
– విశ్వేశ్వర్,
ఇన్‌చార్జ్ తూనికలు, కొలతల అధికారి
వ్యాపారుల ఇష్టారాజ్యం
బాట్లకు బదులు రాళ్లు..
తూకంలో తేడాలు
నష్టపోతున్న వినియోగదారులు
రెండేళ్లుగా ఇన్‌చార్జ్ తూనికలు,
కొలతల అధికారి బాధ్యతలు
ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు


